ఏపీలో అభివృద్ధి-సంక్షేమంతో సుపరిపాలన అందిస్తున్నాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu Outlines Swarna Andhra Vision-2047 at TDP Leadership Conclave

‘నాయకత్వం అంటేనే తెలుగుదేశం పార్టీ’ అని అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘లీడర్‌షిప్ కాంక్లేవ్‌’ వర్క్‌షాప్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. సమర్థమైన నాయకత్వంతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలమని పేర్కొన్నారు.

సమర్థ నాయకత్వంతో సమస్యలకు పరిష్కారం

తాను ఎన్నో సమస్యలను పరిష్కరించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని చంద్రబాబు తెలిపారు. అయితే నీటి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడు తనకు అత్యంత సంతృప్తి కలుగుతుందని చెప్పారు. నాయకత్వం అంటే కేవలం పదవి కాదని.. సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపించడమేనని వివరించారు.

వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు భవిష్యత్తును అంచనా వేయాలని పార్టీ నేతలకు సూచించారు. చెడు గురించి తెలుసుకున్నప్పుడే మంచి విలువ ఏమిటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

గత పాలనపై విమర్శలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను వెంటిలేటర్‌పై పెట్టారని చంద్రబాబు విమర్శించారు. వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు.

ఏపీ ప్రజలు ఎన్నడూ లేని విధంగా కూటమికి భారీ విజయాన్ని అందించారని గుర్తు చేశారు. పాలకుడు ఏ విధంగా ఉండకూడదనే దానికి గత పాలకుడి పాలన ఒక కేస్ స్టడీగా మారిందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరంతరం పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మధ్య సమతుల్యతతో పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.

స్వర్ణాంధ్ర విజన్‌-2047

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం స్వర్ణాంధ్ర విజన్‌-2047ను రూపొందించామని చంద్రబాబు తెలిపారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ విజన్ ప్లాన్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. తాను నెలకు కనీసం నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు.

పేదల సేవలో, ‘మీ భూమి-మీ హక్కు’, ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’, ‘సంజీవని’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్నామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 63 లక్షల మందికి రూ.73 వేల కోట్ల మేర పింఛన్లు ఇప్పటికే పంపిణీ చేశామని వెల్లడించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, దీపం, ఆటోడ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో, మత్స్యకారుల సేవలో వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి

మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 28 కొత్త పాలసీల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలను భూమిపైకి తీసుకువస్తున్నామని తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చామని అన్నారు. ఉత్తరాంధ్ర ఇక వెనుకబడిన ప్రాంతం కాదని.. అభివృద్ధికి కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు వస్తున్నాయని తెలిపారు.

రాయలసీమ రైజింగ్‌పై దృష్టి

అమరావతిని క్వాంటం నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. పోర్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ‘రాయలసీమ రైజింగ్’ నినాదంతో గోల్డ్ ఫీల్డ్, ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చామని తెలిపారు.

రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా కొత్త ఆవిష్కరణలను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు.

సాంకేతికతతో పాలనలో మార్పులు

పరిపాలనలో సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం 1100 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా భూములకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. వందేళ్లకు పైగా పరిష్కారం కాని భూ వివాదాలను పరిష్కరిస్తున్నామని, 22ఏ భూములకు కూడా పరిష్కారం చూపుతున్నామని చంద్రబాబు వెల్లడించారు.

దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాయకత్వ కాంక్లేవ్‌ ద్వారా టీడీపీ నేతలకు పార్టీ భవిష్యత్‌ దిశ, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సుపరిపాలనపై మరింత స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here