ఏపీ స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. 28 జిల్లాలకు ఇన్‌ఛార్జిల నియామకం

TDP Appoints In-Charges For 28 Districts Ahead of Local Body Elections in AP

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జిలను నియమించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పార్టీ శ్రేణుల సమన్వయం వరకు కీలక బాధ్యతలను వీరు పర్యవేక్షించనున్నారు.

ఇప్పటికే జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులు ఉండగా.. వారికి సహాయకులుగా ఎన్నికల ఇన్‌ఛార్జిలు పనిచేయనున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడం, స్థానికంగా తలెత్తే వివాదాలను పరిష్కరించడం వంటి అంశాల్లో వీరు కీలకంగా వ్యవహరించనున్నారు.

కుప్పం నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

మరోవైపు కుప్పం నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన.. స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు.

పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పదవులు పొందిన వారు పార్టీ కోసం కష్టపడి పనిచేయాల్సిందేనని, ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

లాలూచీ రాజకీయాలకు స్వస్తి పలికి, పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు సూచించినట్లు టీడీపీ నేతలు తెలిపారు.

జిల్లాల వారీగా బాధ్యతలు

  • పార్వతీపురం మన్యం – దాడి రత్నాకర్
  • అల్లూరి సీతారామరాజు – పేరాబత్తుల రాజశేఖర్
  • శ్రీకాకుళం – ఎండీ నజీర్
  • విజయనగరం – ఎంపీ చింతకాయల విజయ్
  • విశాఖపట్నం – ఎంఏ షరీఫ్
  • అనకాపల్లి – కొండపల్లి అప్పలనాయుడు
  • పోలవరం – కె. సత్తిబాబు
  • కాకినాడ – సుజయ్ కృష్ణరంగారావు
  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – ఎంపీ సానా సతీష్
  • తూర్పుగోదావరి – దేవినేని ఉమామహేశ్వరరావు
  • పశ్చిమగోదావరి – ఎంపీ భాష్యం రామకృష్ణ
  • ఏలూరు – ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
  • కృష్ణా – కొమ్మాలపాటి శ్రీధర్
  • ఎన్టీఆర్ – మక్కెన మల్లికార్జునరావు
  • గుంటూరు – ఎంవీ సత్యనారాయణరాజు
  • పల్నాడు – కొనకళ్ల నారాయణ
  • బాపట్ల – జంగా కృష్ణమూర్తి
  • ప్రకాశం – ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
  • మార్కాపురం – ఎమ్మెల్సీ బీటీ నాయుడు
  • నెల్లూరు – ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ
  • తిరుపతి – నూకసాని బాలాజీ
  • చిత్తూరు – దామచర్ల సత్య
  • కడప – దీపక్ రెడ్డి
  • అన్నమయ్య – ఎమ్మెల్సీ శ్రీకాంత్
  • అనంతపురం – ఏరాసు ప్రతాప్‌రెడ్డి
  • శ్రీసత్యసాయి – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  • కర్నూలు – పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి
  • నంద్యాల – వైకుంఠం ప్రభాకర్ చౌదరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here