ఎమ్మెల్సీ తాతా మధుపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫైర్‌.. బీఆర్‌ఎస్‌ అధినేతకు కీలక డిమాండ్‌

CM Revanth Reddy Slams BRS Over MLC Tatha Madhu Remarks Against Telangana Speaker

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. స్పీకర్‌ చైర్‌ను అవమానించడం అంటే మొత్తం శాసనసభ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

స్పీకర్‌ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ

ప్రజాస్వామ్యంలో ముందుగా చర్చలు జరిగి.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్ణయం తీసుకున్న తర్వాత చర్చలు జరగవని స్పష్టం చేశారు. సభలో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపైనా చర్చకు సిద్ధమని చెప్పారు.

స్పీకర్‌ చైర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసినప్పుడు బీజేపీ ఎందుకు స్పందించడం లేదని సీఎం ప్రశ్నించారు. సభ్యుల హక్కులను కాపాడుతున్న స్పీకర్‌ను అవమానిస్తే దానిని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. స్పీకర్‌ను అత్యంత అవమానకరంగా ఉద్దేశించి మాట్లాడిన అంశం కంటే సభలో చర్చించాల్సిన ముఖ్యమైన విషయం ఇంకేముంటుందని ప్రశ్నించారు.

‘ఇది తెలంగాణకు చీకటి రోజు’

స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం సహించలేని భాషను ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు.

దళితులు, గిరిజనులకు మాత్రమే కాకుండా మొత్తం సభ్య సమాజానికే ఇది అవమానమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి గాయమైందని అన్నారు. దూషణలకు కేసీఆర్‌ ప్రోత్సహించారని, ఆయన వెనుక ఉండటంతోనే బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌పై సీఎం విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ తన దళిత వ్యతిరేక ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్ తరాలు ఈ సభను క్షమించవని హెచ్చరించారు.

తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్‌ఎస్ వెంటనే డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనతో రాజీనామా చేయించాలని.. లేదంటే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.

అంతేకాకుండా ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌ చైర్‌ గౌరవాన్ని కాపాడే విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి అందరూ ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు.

సభాపతి గౌరవాన్ని కాపాడటం ప్రతి సభ్యుడి బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. స్పీకర్‌పై జరిగిన వ్యాఖ్యలను బీజేపీ సమర్థిస్తుందా అని ప్రశ్నిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి అంశాలను పక్కన పెట్టడం సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here