ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్ వర్గాలకు చెందిన వారు నిర్దేశిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
పింఛన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే
కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. పింఛన్ కేటగిరీని బట్టి అదనపు ధ్రువపత్రాలు కూడా అవసరం.
- వృద్ధాప్య పింఛన్: వయో నిర్ధారణ సర్టిఫికెట్ లేదా ఆధార్.
- వితంతు పింఛన్: భర్త మరణ ధ్రువపత్రం లేదా భర్త ఆధార్.
- వివాహిత ఒంటరి మహిళలు: విడాకుల ధ్రువపత్రం.
- అవివాహిత ఒంటరి మహిళలు: తహసీల్దార్ ధ్రువపత్రం.
- దివ్యాంగులు: కనీసం 40 శాతం వైకల్యానికి సంబంధించిన సదరం సర్టిఫికెట్.
- చేనేత కార్మికులు: జౌళి శాఖ జారీ చేసే ధ్రువపత్రం.
- మత్స్యకారులు: మత్స్యశాఖ జారీ చేసే ధ్రువపత్రం.
- డప్పు కళాకారులు, చర్మకారులు: సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే ధ్రువపత్రం.
- కల్లుగీత కార్మికులు: ఎక్సైజ్ శాఖ ధ్రువపత్రం.
- ట్రాన్స్‌జెండర్లు: జిల్లా వైద్య బోర్డు జారీ చేసే ధ్రువపత్రం.
ఇదీ కొత్త పింఛన్ల షెడ్యూల్
కొత్త పింఛన్ల ప్రక్రియను ప్రభుత్వం నిర్ణీత గడువులో పూర్తి చేయనుంది.
దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు.
దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలి: గ్రామ, వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌కు.
ఈ-కేవైసీ: ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ పరిశీలన బాధ్యత డిజిటల్ అసిస్టెంట్‌దే.
అర్హత పరిశీలన: స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు, ఆర్టీజీఎస్, సెర్ప్ విభాగాలు పరిశీలిస్తాయి.
క్షేత్రస్థాయి పరిశీలన: సెప్టెంబర్ 17 నుంచి 21లోగా పూర్తి చేయనున్నారు.
అర్హత నిర్ణయం: ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలిస్తారు.
అర్హత నిర్ణయ ప్రక్రియ: సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు.
తుది ఆమోదం: సెప్టెంబర్ 25 నుంచి 26లోగా సెర్ప్ తుది ఆమోదం ఇవ్వనుంది.
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
అర్హులైన వారు ముందుగా స్వర్ణగ్రామ లేదా స్వర్ణవార్డు కార్యాలయాల నుంచి నిర్దేశిత దరఖాస్తు ఫారాలను పొందవచ్చు. సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల నుంచి కూడా ఫారాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఫారంలో అడిగిన వివరాలను పూర్తిగా నింపి, కేటగిరీకి సంబంధించిన అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి స్థానిక స్వర్ణగ్రామ లేదా స్వర్ణవార్డు కార్యాలయంలో సమర్పించాలి.
వివరాల నమోదు, ఈ-కేవైసీ
దరఖాస్తులను డిజిటల్ అసిస్టెంట్ లేదా సంబంధిత వార్డు సిబ్బంది స్వీకరించి ప్రాథమిక వివరాలను పరిశీలిస్తారు. అనంతరం ఎస్‌జీఎస్‌డబ్ల్యూ కొత్త పింఛన్ సేవా పోర్టల్‌లో దరఖాస్తును నమోదు చేస్తారు. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారుడికి రసీదు అందజేస్తారు.
దరఖాస్తులో పేర్కొన్న వివరాలను ఈ-కేవైసీ వివరాలతో సరిపోల్చుతారు. వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తు తదుపరి దశకు వెళ్తుంది. వివరాల్లో తప్పులు ఉంటే దరఖాస్తుదారుడికి సమాచారం ఇచ్చి అవసరమైన సవరణలకు అవకాశం కల్పిస్తారు.
అర్హతను ఎలా నిర్ణయిస్తారు?
2019 డిసెంబర్ 13న జారీ చేసిన ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ మార్గదర్శకాలు, ప్రస్తుతం ఉన్న పింఛన్‌దారుల డేటాబేస్‌ను ఆధారంగా చేసుకుని దరఖాస్తుదారుల అర్హతను పరిశీలిస్తారు.
ఈ దశలోనే అర్హత లేని దరఖాస్తులు గుర్తిస్తే వాటిని తిరస్కరించి, అందుకు సంబంధించిన కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేస్తారు. అర్హత సాధించిన వారి దరఖాస్తులు తదుపరి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తాయి.
అందువల్ల కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ కేటగిరీకి అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.








































