తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

BRS MLC Tatha Madhu Arrested Over Remarks Against Telangana Assembly Speaker

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద మంగళవారం ఉదయం భారీగా పోలీసులు మోహరించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాతా మధు, నవీన్ రెడ్డిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.

స్పీకర్‌పై వ్యాఖ్యలతో వివాదం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు అసెంబ్లీ ప్రాంగణం వెలుపల చోటుచేసుకున్న ఆందోళనల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ పదవిని, సభ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో తాతా మధుపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హైడ్రామా

కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు హైదర్‌గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న తాతా మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అరెస్టు అనంతరం తాతా మధును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

‘స్పీకర్‌ను ఏమీ అనలేదు’

మరోవైపు తన అరెస్టుపై తాతా మధు స్పందించారు. తాను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తనపై దాడి చేసి గొంతు నొక్కేందుకు ప్రయత్నించిన వారిని ఉద్దేశించే ఆవేశంలో మాట్లాడానని వివరణ ఇచ్చారు.

అయితే తన వ్యాఖ్యల వల్ల స్పీకర్‌ మనస్తాపానికి గురై ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు కూడా ప్రకటించారు.

పలువురు బీఆర్‌ఎస్ నేతలపై కేసులు

అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఆందోళనలకు సంబంధించి పలువురు బీఆర్‌ఎస్ నేతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరుల పేర్లు కూడా కేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య ఇప్పటికే తీవ్ర రాజకీయ వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాతా మధు అరెస్ట్‌ వ్యవహారం మరింత రాజకీయ వేడిని పెంచింది. ఈ కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలు, బీఆర్‌ఎస్ స్పందనపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here