రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేసి, తెలుగు తల్లికి జలహారతి ఇస్తాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu Vows to Complete All Projects on Time and Provide Water to Every Acre in AP

వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని.. వాస్తవాలతో గట్టిగా కౌంటర్ ఇవ్వాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ప్రజలకు పదేపదే వివరించాలని సూచించారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రెండు రోజుల లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సీఎంచంద్రబాబు పాల్గొని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు వక్రీకరణలు చేస్తున్నాయని విమర్శించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తప్పుడు ప్రచారానికి వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని సూచించారు.

వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల విషయంలో గతంలో వైసీపీ చేసిన ప్రచారాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రాజెక్టులు పూర్తి కాకముందే ప్రారంభించినట్లు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరు అందించే ప్రయత్నాలు జరుగుతున్నా.. ఆ నీరు గోదావరి జలాలు కావంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు వివరించి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు.

ప్రతి ఎకరాకూ నీరిచ్చి తెలుగుతల్లికి జలహారతి

పోలవరం సహా రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరు అందించి తెలుగుతల్లికి జలహారతి ఇస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రారంభించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించి నీటి వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టాలని అన్నారు.

టీడీపీ బలోపేతం.. కూటమి ఐక్యత

టీడీపీ రాజకీయంగా బలపడటం ఎంత ముఖ్యమో.. కూటమి ఐక్యతను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫొటోలు, ఫ్లెక్సీల వంటి చిన్న విషయాలపై వివాదాలకు తావివ్వకుండా కూటమి నేతలు కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే 2029లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు కష్టపడాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు ఇస్తున్నామని చెప్పారు. పార్టీ బలోపేతం కావాలంటే కార్యకర్తలు బలంగా ఉండాలని పేర్కొన్నారు.

సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని చంద్రబాబు సూచించారు. ప్రజల ఓటే తమకు గీటురాయిగా ఉండాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి భారీ పెట్టుబడులు రావడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి కేంద్రంగా మారుతోందని చంద్రబాబు అన్నారు. అమరావతిని క్వాంటం టెక్నాలజీ, నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

రాయలసీమ అభివృద్ధికి ‘రాయలసీమ రైజింగ్’ నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గోల్డ్ ఫీల్డ్, ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని.. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

‘పార్టీయే సుప్రీం’.. లోకేశ్ కీలక సూచనలు

కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేశ్ కూడా పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. పార్టీ ఏదైనా పని అప్పగిస్తే దానికి పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పార్టీ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

‘వాటర్‌మ్యాన్‌’గా సీఎం చంద్రబాబుకు అభినందనలు

కాంక్లేవ్ ప్రారంభంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం చంద్రబాబును అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, జల సంరక్షణపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు.

ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి తెలుగు యువతను ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దిన చంద్రబాబు.. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టి ‘వాటర్‌మ్యాన్’గా మారారని పేర్కొన్నారు. పోలవరం, వెలిగొండ, పట్టిసీమ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నీరు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

సాగునీటి రంగంపై చంద్రబాబు చేస్తున్న కృషికి కాంక్లేవ్‌లో పాల్గొన్న టీడీపీ నేతలు స్టాండింగ్ ఒవేషన్‌తో అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here