ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని మాచవరంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రజలతో మాట్లాడారు. నీరు జీవమైతే.. భూమి జీవితమని పేర్కొన్న చంద్రబాబు, ప్రజల భూముల హక్కులను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని సీఎం తెలిపారు. భూముల హక్కుల విషయంలో పూర్తి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదారు పాస్‌బుక్‌లను రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 లక్షల పాస్‌బుక్‌లను పంపిణీ చేయాల్సి ఉందని, అవినీతికి తావులేకుండా వాటిని అందిస్తున్నామని చెప్పారు.
ప్రజలు భూముల సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా టెక్నాలజీని వినియోగిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పెండింగ్ భూ సమస్యలను పరిష్కరించామని, మిగిలిన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని పెండింగ్ భూసమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
55 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలే చేశా
తాను 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ముఖ్యమంత్రిగా 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని చంద్రబాబు తెలిపారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో విలువలకు కట్టుబడి పనిచేశానని, సంపదపై తనకు ఎలాంటి ఆశ లేదని అన్నారు.
గతంలో తనను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచారని చంద్రబాబు ఆరోపించారు. తన అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు స్పందించారని గుర్తుచేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు మద్దతుగా పోరాడారని తెలిపారు.
కక్ష సాధింపు రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “కక్ష తీర్చుకోవాలంటే ఒక్క నిమిషంలో అరెస్ట్ చేయించి జైలుకు పంపగలను.. కానీ నాకు సహనం ఎక్కువ” అని అన్నారు.
వైఎస్ జగన్ పాలనపై విమర్శలు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరంగా పెట్టారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ ఘటనపై అప్పట్లోనే సరైన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రజలు చూశారని చంద్రబాబు అన్నారు.
14 డీఎస్సీలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చాం
రాష్ట్రంలో తాను 14 డీఎస్సీలు నిర్వహించి, ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. అయితే ఏడాది తర్వాత డీఎస్సీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ అంశంపై కొందరు వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంజీవినిగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రాధాన్యం
కోనసీమ ప్రాంతం గురించి ప్రస్తావించిన చంద్రబాబు, మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి సేవలను గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
సామాజిక బాధ్యతగా పీ4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకమైన రికార్డులు, సాంకేతికత ఆధారిత సేవల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.








































