ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై జగన్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. పరీక్షలు రాయకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కేటాయించారని, నకిలీ క్రీడా ధ్రువపత్రాలను ఉపయోగించి అర్హత సాధించినట్లు చూపించారని ఆరోపించారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు
జీవో నంబర్ 4 ఆధారంగా 40కి పైగా ఉపాధ్యాయ పోస్టులను పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేశారని జగన్ ఆరోపించారు. జరగని క్రీడా పోటీల్లో పాల్గొన్నట్లు చూపిస్తూ కొందరు నకిలీ సర్టిఫికెట్లు పొందారని, వాటి ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు.
జూడో, సాఫ్ట్‌బాల్, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడలకు సంబంధించిన ధ్రువపత్రాల్లో అవకతవకలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. అర్హత లేని వ్యక్తులతో పాటు ఒకే కుటుంబానికి చెందిన పలువురికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు కేటాయించారని కొన్ని ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.
సర్టిఫికెట్లు నకిలీవి?
కొన్ని క్రీడా ధ్రువపత్రాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయని జగన్ తెలిపారు. కొన్ని సర్టిఫికెట్లు నకిలీవని సంబంధిత సంస్థలు ధ్రువీకరించినప్పటికీ నియామక ప్రక్రియను కొనసాగించారని ఆరోపించారు.
టెట్‌లో నిర్దేశిత కట్‌ఆఫ్ మార్కులు సాధించని వారు, సర్టిఫికెట్ల పరిశీలనలో అనర్హులుగా తేలిన వారికి కూడా ఉన్నతస్థాయి ఒత్తిళ్లతో పోస్టింగ్‌లు ఇచ్చారని జగన్ ఆరోపించారు. రోస్టర్ నిబంధనలను కూడా ఉల్లంఘించారని విమర్శించారు.
కాక్రోచ్‌లు రాక తప్పదు
“డీఎస్సీపై నేను లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ సమాధానం చెప్పలేకపోతున్నారు. మహిళా అధికారులతో పొంతనలేని వివరణలు ఇప్పిస్తున్నారు. పాలకులు ఇలా వ్యవస్థలను చెడగొడితే కాక్రోచ్‌లు పూనుకొస్తాయి. అందుకే నాలాంటోడు కూడా కాక్రోచ్ అవుతున్నాడు. లోకేష్ రాజీనామా చేయకపోతే కాక్రోచ్‌లు రాక తప్పదు” అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
సీబీఐ విచారణకు డిమాండ్
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ లేదా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు.
ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు.
సోషల్ మీడియా సెన్సార్‌షిప్‌పై విమర్శలు
తమ పార్టీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లకుండా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల సోషల్ మీడియా ఖాతాలపై సెన్సార్‌షిప్ విధిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
డీఎస్సీ నియామకాలపై తాము లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఆరోపణలు నిజమా కాదా అనేది స్వతంత్ర దర్యాప్తుతో తేల్చాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.









































