ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణి స్పష్టం చేశారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఎంపిక, టెట్ అర్హతలు, క్రీడా సర్టిఫికెట్లు, కేటగిరీ ధ్రువీకరణలకు సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికల్లో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.
నియమనిబంధనల ప్రకారమే ఎంపిక
అమరావతి సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ-2025లో క్రీడల కోటా భర్తీ ప్రక్రియను అన్ని నిబంధనలకు అనుగుణంగానే పూర్తి చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థుల అర్హతలు, సమర్పించిన ధ్రువపత్రాలు, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు.
అర్హతలకు సంబంధించి ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వాటిని పరిశీలించేందుకు విద్యాశాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆధారాలతో కూడిన ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నకిలీ సర్టిఫికెట్లు తేలితే కఠిన చర్యలు
క్రీడా సర్టిఫికెట్లలో నకిలీలు ఉన్నట్లు నిర్ధారణ అయితే లేదా అర్హత నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే ఆరోపణల కారణంగా అర్హులైన అభ్యర్థులకు నష్టం జరగకూడదని స్పష్టం చేశారు.
జూడో క్రీడా సర్టిఫికెట్లకు సంబంధించిన అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగానే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
టెట్ అర్హతలపై కూడా స్పష్టత
మెగా డీఎస్సీకి సంబంధించి టెట్ అర్హతలపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పలు కేస్ స్టడీలను, అభ్యర్థుల రికార్డులను మీడియా ముందు ప్రదర్శించి వివరించారు.
అలాగే క్రీడాకారులు తమ సొంత జిల్లాలోనే కాకుండా తాము చదువుకున్న లేదా గతంలో ఉద్యోగం చేసిన ప్రాంతాల నుంచి కూడా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించే వెసులుబాటు ఉందని క్రీడా సంఘాలు స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆధారాలుంటే ఫిర్యాదు చేయాలి
ఎంపిక ప్రక్రియలో క్రీడాకారుల ప్రతిభకు పూర్తి న్యాయం జరిగేలా అధికారిక సమాచారం, ధ్రువపత్రాలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆధారాలు లేకుండా అభ్యర్థులపై ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.
అలాగే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల ఆధారంగా పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను అవమానించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అభ్యర్థుల అర్హతలపై నిజమైన ఆధారాలు ఉంటే వాటిని అధికారికంగా సమర్పించాలని సూచించారు.









































