ఇందిరమ్మ టవర్స్ లాటరీలో ఇళ్లు రాని వారికి డిపాజిట్ రీఫండ్ షురూ

Telangana Housing Board Refund Deposits For Unsuccessful Applicants in Indiramma Towers Lottery

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఫ్లాట్ దక్కని దరఖాస్తుదారులకు శుభవార్త అందింది. దరఖాస్తు సమయంలో హౌసింగ్ బోర్డుకు చెల్లించిన రూ.10,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD)ను తిరిగి ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.

మొత్తం 16 నియోజకవర్గాల నుండి 60,720 వరకు దరఖాస్తులు రాగా, అందులో దాదాపు 40వేల మందిని అనర్హులుగా తేల్చింది. దీంతో వీరందరికీ డిపాజిట్ ఎమౌంట్ వెనక్కి తిరిగి ఇచ్చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే రీఫండ్‌లు జారీ చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో చెల్లించిన వారికి ప్రత్యేక నిబంధన

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆన్‌లైన్ విధానంలో EMD చెల్లించిన వారికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారు ఏ బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము పంపారో అదే ఖాతాకు రీఫండ్ నేరుగా బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియను సుమారు వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

నగదు చెల్లించిన వారు ఏం చేయాలి?

మీ-సేవా కేంద్రాల్లో నగదు రూపంలో EMD చెల్లించిన వారికి మాత్రం ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. అలాంటి అభ్యర్థులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.inలో ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీఫండ్ అందుకోవాల్సిన బ్యాంకు ఖాతా వివరాలను అక్కడ సమర్పించాల్సి ఉంటుంది.

ఇతరుల బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు చేసిన సందర్భాల్లో కూడా సొమ్ము అందుకోవాల్సిన వ్యక్తి ఖాతా వివరాలను నిబంధనల ప్రకారం అందించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.

లాటరీ విజేతల వెరిఫికేషన్ కొనసాగింపు

ఇదిలా ఉండగా, లాటరీలో ఫ్లాట్లు పొందిన అభ్యర్థుల వివరాల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. ఎంపికైన వారి అర్హతను నిర్ధారించే ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని హౌసింగ్ బోర్డు తెలిపింది.

రీఫండ్ లేదా దరఖాస్తుకు సంబంధించి సందేహాలు ఉన్నవారు 040-24603572 నంబర్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here