తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆహ్వానం అందించింది. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మి, జానకీదేవి ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు.
అనంతరం తిరుమలలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్, ఈవోలతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి వివిధ వాహన సేవలు, విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఉత్సవాల సమయంలో స్వామివారి వాహన సేవలు, విశేష కార్యక్రమాలు, ముఖ్యమైన ఉత్సవాల వివరాలను భక్తులకు తెలియజేసేందుకు టీటీడీ ప్రత్యేక బుక్‌లెట్‌ను కూడా విడుదల చేసింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.








































