భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘సెమికాన్ ఇండియా 2026’ ఐదో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని యశోభూమిలో సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి సదస్సు ద్వారా దేశంలో సెమీకండక్టర్ తయారీ, డిజైన్, టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలను మరింత ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారించనుంది.
‘సిలికాన్ టు సిస్టమ్స్ – బిల్డింగ్ ది ఎకోసిస్టమ్’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), అంతర్జాతీయ పరిశ్రమల సంస్థ SEMI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, తయారీ నుంచి పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ వరకు దేశీయ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది.
సెమికాన్ ఇండియా 2026లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సెమీకండక్టర్ సంస్థలు పాల్గొననున్నాయి. ASML, Micron, Tata Electronics, Infineon, Lam Research వంటి దిగ్గజ సంస్థలతో పాటు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సాంకేతికత, ఉత్పత్తులు, భవిష్యత్ ప్రణాళికలను ప్రదర్శించనున్నాయి. మొత్తం 600కు పైగా ఎగ్జిబిటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటుండగా.. వీరిలో సుమారు 300 విదేశీ సంస్థలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక సెమీకండక్టర్ తయారీ రంగంలో భారత్ ఇప్పటికే కీలక అడుగులు వేసింది. ‘సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ 1.0’ కింద కేంద్ర ప్రభుత్వం 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో మూడు యూనిట్లు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. దీంతో భారత్‌లో సెమీకండక్టర్ తయారీకి అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతిక సామర్థ్యాలను పెంచే దిశగా మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో తదుపరి దశగా ‘సెమికాన్ 2.0’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 కేంద్ర బడ్జెట్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని తొలుత ప్రకటించగా.. జులై 15, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి అధికారికంగా ఆమోదం లభించింది.
సెమికాన్ 2.0కు మొత్తం రూ.1,27,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను మరింత స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశం కీలక పాత్ర పోషించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఆరు ప్రధాన స్తంభాల ఆధారంగా సెమికాన్ 2.0ను అమలు చేయనున్నారు. సెమీకండక్టర్ తయారీతో పాటు డిజైన్, పరిశోధన, ప్యాకేజింగ్, సాంకేతిక అభివృద్ధి, నైపుణ్యాల పెంపు వంటి విభాగాల్లో దేశ సామర్థ్యాన్ని పెంచేలా తదుపరి దశలో చర్యలు చేపట్టనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారత్ ఈ రంగంలో భారీ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టెలికాం, రక్షణ, కృత్రిమ మేధ వంటి అనేక రంగాలకు చిప్స్ కీలకం కావడంతో.. దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచడం వ్యూహాత్మకంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సెమికాన్ ఇండియా 2026 ద్వారా భారత్ తన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను ప్రపంచ పెట్టుబడిదారులకు మరింత చేరువ చేయనుంది.



































