దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఆక్రమిత నివాస స్థలాలు, కొండ ప్రాంతాల ఇళ్ల స్థలాల సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 24,057 నిరుపేద కుటుంబాలకు సంపూర్ణ యాజమాన్య హక్కులతో కూడిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
617 ఎకరాలపై పేదలకు హక్కులు
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని 15 మండలాల్లో 617 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస స్థలాలను లబ్ధిదారుల పేరిట క్రమబద్ధీకరించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ భూముల విలువ సుమారు రూ.9,800 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ.24,297 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఒక్కో లబ్ధిదారు కుటుంబానికి సగటున రూ.40 లక్షల విలువైన ఆస్తిపై హక్కులు లభించనున్నాయి.
బ్యాంకు రుణాలకు అవకాశం
పట్టాలపై క్లియర్ టైటిల్ రావడంతో లబ్ధిదారులకు ఆస్తిపై చట్టబద్ధమైన భద్రత లభించడంతో పాటు, అవసరమైన సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందాయి.
ఇటీవల విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు విజయవాడలోనూ భారీ స్థాయిలో పట్టాల పంపిణీ చేపట్టింది. పేదలకు ఆస్తి హక్కులు కల్పించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.







































