సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. స్వాగతం పలికిన మంత్రి లోకేష్

AP Dy CM Pawan Kalyan Meets CM Chandrababu To Discuss Coalition Strategy For Local Polls

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంజ్ మంగళవారం సీఎంనివాసానికి చేరుకున్న పవన్‌కు మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురూ కలిసి అల్పాహారం చేస్తూ రాష్ట్ర రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చలు జరిపారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేయడంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయిలో కూటమి సమన్వయ కమిటీల ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఎవరి బలం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఆ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

తొలి దశలో జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. కూటమి పార్టీల మధ్య ఓట్ల విభజన లేకుండా సమన్వయంతో ముందుకెళ్లే విధానంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కోర్టు నిర్ణయం అనంతరం స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై తదుపరి చర్యలు తీసుకునే అంశంపైనా చంద్రబాబు, పవన్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సమన్వయంతో పనిచేసేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కోర్టు నిర్ణయం, ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై మరింత స్పష్టమైన కసరత్తు జరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here