ఈసీ కార్యాలయం వద్ద ప్రతిపక్షాల ఆందోళన.. బ్యారికేడ్ ఎక్కి నిరసన తెలిపిన రాహుల్ గాంధీ

LoP Rahul Gandhi Climbs Barricades During INDIA Bloc March to EC Office in Delhi

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి చేపట్టిన నిరసన మంగళవారం ఢిల్లీలో ఉధృతమైంది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్ సదన్’ వరకు ప్రతిపక్ష ఎంపీలు ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో మార్చ్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టారు.

మార్చ్‌ను పోలీసులు నిలువరించడంతో నిరసనకారులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోలీసుల బ్యారికేడ్‌పైకి ఎక్కి జాతీయ జెండాను ఊపుతూ నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా పలువురు నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

నిరసన తీవ్రతరం కావడంతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనాల్లో తరలించినప్పటికీ, అనంతరం రాహుల్, ప్రియాంక తిరిగి నిరసనలో పాల్గొన్నారు. ఇతర విపక్ష నేతలు కూడా ఈసీ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగించారు.

ఈసీపై తమ ఆందోళనను మరింత విస్తరించేందుకు కాంగ్రెస్ పలు కార్యక్రమాలను ప్రకటించింది. అక్టోబర్‌లో ‘సేవ్ ఓట్, సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. అనంతరం బహిరంగ సమావేశాలు, ఢిల్లీలో భారీ ర్యాలీల ద్వారా ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించాయి. SIR ప్రక్రియ చట్టబద్ధంగానే కొనసాగుతోందని ఈసీ స్పష్టం చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here