సీఈసీ జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించేయించండి – ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

CM Revanth Reddy Demands Resignation of Chief Election Commissioner Gyanesh Kumar

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించాలని, లేనిపక్షంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలే రాజీనామా చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీల అరెస్ట్ ను నిరసిస్తూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఓటర్ల హక్కుల పరిరక్షణకై ఢిల్లీ వీధుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ ప్రజాప్రతినిధులను పోలీసులు తీవ్రవాదుల తరహాలో అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని సీఎం మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సాంద్రత సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ విధానం ద్వారా బిసి, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన కోట్ల మంది ఓట్లను తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సీఎం మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన “సిఐఆర్‌ గో బ్యాక్” (SIR Go Back) మరియు “జ్ఞానేష్ కుమార్ గో బ్యాక్” అని నినాదాలు ఇస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.

భారత స్వాతంత్య్ర పోరాట కాలంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం ఎలాగైతే సాగిందో, ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రాథమిక ఓటు హక్కును కాపాడుకోవడానికి ‘GK (జ్ఞానేష్ కుమార్), SIR గో బ్యాక్’ ఉద్యమం ప్రారంభమైందని రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

వివాదాస్పదంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రయత్నిస్తే, భవిష్యత్తులో ప్రజలు వారినే పదవుల నుంచి తప్పుకునేలా చేస్తారని హెచ్చరించారు. గతంలో నల్ల నల్ల సాగు చట్టాల విషయంలో దేశ రైతాంగానికి లొంగిపోయి ఉపసంహరించుకున్నట్లే, ఈ ఓటర్ల సవరణ వివాదంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పక తప్పదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గతంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉపయోగించారంటూ రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ ఆందోళన కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదని.. ఇండియా కూటమి, ప్రజల ఉద్యమమని రేవంత్‌రెడ్డి అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ కోసం వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఇండియా (INDIA) కూటమి భాగస్వామ్యంతో ఓటర్ల హక్కుల పరిరక్షణకై ఈ పోరాటాన్ని వీధుల నుంచి పార్లమెంట్ వరకు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. ఎన్నికల సంఘాన్ని కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని సహించేది లేదని, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కాపాడుకునే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here