కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు వినూత్న పాలన విధానాలపై సీఎం ఈ వేదికగా కీలక ఆలోచనలను పంచుకున్నారు. గతంలో ఉన్న “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నమూనా నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” వైపు వేగంగా పరుగులు తీస్తోందని ఆయన స్పష్టం చేశారు.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోనే మంజూరు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వం సంపూర్ణ భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను వినూత్న ఆవిష్కరణలు, సాంకేతికత మరియు తయారీ రంగానికి ప్రధాన గమ్యస్థానంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
కేవలం సంప్రదాయ పారిశ్రామిక రంగాధిక్యతే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ అభివృద్ధి రంగాలలో (Deep Tech Fields) పెట్టుబడులకు ఏపీ కేంద్రబిందువుగా మారుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 160 గిగావాట్లకు పైగా అందించేలా భారీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని విరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు ఉద్యోగ నిరుద్యోగితను తగ్గించేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధికి (Skill Development) ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
అమరావతిలో సీఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటిస్తూ, భవిష్యత్ ప్రపంచ శ్రేణి విధాన చర్చలకు మరియు ఆవిష్కరణలకు ఈ కేంద్రం వేదికగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పారదర్శక పాలన, మౌలిక వసతులు మరియు వేగవంతమైన నిర్ణయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో మళ్ళీ అగ్రస్థానంలో నిలబెడతామని సీఎం స్పష్టం చేశారు.







































