ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తదితర పక్షాలు తలపెట్టిన జంతర్ మంతర్ నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు మరియు ఆంక్షలు అమలవుతున్నాయి. నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసిన ఢిల్లీ పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతీయ రాజధానిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి దేశ రాజధానికి చేరుకుంటున్న నిరసనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది.
ఇక ఈ ఆందోళనలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత కఠినమైన భద్రతా చర్యలకు ఉపక్రమించాయి. ఢిల్లీ వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 23,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని, కేంద్ర బలగాలను మొహరించారు. నిరసనకారుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ స్పష్టమైన దృశ్యాలు రికార్డేలా నైట్ విజన్ కెమెరాలు, సీసీటీవీలను కీలక ప్రాంతాల్లో అమర్చారు.
అంతేకాకుండా, ఆందోళనకారులను గుర్తించేందుకు, శాంతిభద్రతల విధుల్లో పాల్గొనే పోలీసుల రక్షణార్థం, ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలను కేటాయించారు. గగనతల మార్గాల నుంచి గుంపులను అంచనా వేయడానికి డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. మహిళా భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రత్యేకంగా మహిళా పోలీసులతో కూడిన ‘పింక్ ఫోర్స్’ బృందాలను రంగంలోకి దించారు.
నిరసనకారులు భారీ సంఖ్యలో రాజధానికి చేరుకోకుండా కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా దేశ రాజధాని వైపు వచ్చే సుమారు 250కి పైగా రైళ్లను (మెయిల్, ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు) రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.
అలాగే, ప్రయాణికుల రద్దడిని, ఆందోళనకారుల రాకను నియంత్రించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా రాజధాని వ్యాప్తంగా 45 మెట్రో స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణలను తాత్కాలికంగా నిలిపివేశారు. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, జనపథ్, మండి హౌస్ వంటి ప్రధాన జంక్షన్లలో మెట్రో గేట్లను మూసివేశారు.
నిరసనలకు అనుమతి లేకపోవడంతో నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనకు దిగిన పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. కేంద్రీయ ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధించడంతో పాటు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీలు జారీ చేశారు.







































