మన దేశ వ్యవస్థను మనమే అవహేళన చేయడం మంచిది కాదు – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Former VP Venkaiah Naidu Criticises Opposition’s Demand For CEC’s Resignation

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు స్పందించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ వివాదాల్లోకి లాగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

నిరాధార ఆరోపణలతో సీఈసీ, ప్రధానమంత్రి రాజీనామాలను కోరడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు తమ విజయంగా చెప్పుకోవడం, ఓడిపోయినప్పుడు ఈవీఎంలను నిందించడం హాస్యాస్పదమని వెంకయ్య నాయుడు అన్నారు. ఓటర్ల పేర్లను మూకుమ్మడిగా తొలగిస్తున్నారన్న ఆరోపణలను ఆయన అపోహలుగా అభివర్ణించారు. ఓట్ల తొలగింపునకు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగిస్తున్నారన్న వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఎన్నికల వ్యవస్థను దేశ ప్రజలే అవహేళన చేయడం మంచిది కాదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సీఈసీ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) భాగస్వామ్యం ఉండటం సరైంది కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

భారత్‌ దివాళా తీసిందంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యాఖ్యలు తనకు ఆవేదన కలిగించాయని వెంకయ్య నాయుడు అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశ ఆర్థిక ప్రగతి ప్రధాని మోదీ ఒక్కరి ఘనత మాత్రమే కాదని, ప్రజల కృషి కూడా అందులో ఉందని పేర్కొన్నారు.

అయితే, ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలు, ఎన్నికల సంఘం పనితీరుపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here