మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు

CM Chandrababu and Dy CM Pawan Kalyan Pay Tributes To Former President Abdul Kalam on His Jayanti

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. దేశానికి కలాం అందించిన సేవలను, ఆయన ఆదర్శప్రాయమైన జీవితాన్ని స్మరించుకున్నారు.

అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తి శిఖరమని చంద్రబాబు కొనియాడారు. అరుదైన వ్యక్తిత్వం కలిగిన ఆయన దేశ అణు, శాస్త్ర సాంకేతిక రంగాలకు కొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడని పేర్కొన్నారు. కలాం జయంతి సందర్భంగా ఆయన దేశానికి, సమాజానికి చేసిన సేవలను స్మరించుకోవాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.

కలాం వారసత్వాన్ని గౌరవిద్దాం: పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో.. నిరాడంబర కుటుంబంలో జన్మించి, దేశం గర్వించే శాస్త్రవేత్తగా, ప్రజల అభిమానాన్ని పొందిన రాష్ట్రపతిగా కలాం ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. విద్య, క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావానికి ఆయన జీవితం నిదర్శనమని పేర్కొన్నారు.

భారతదేశ స్వదేశీ ఎస్‌ఎల్‌వీ-III ప్రయోగ వాహనం అభివృద్ధి, అగ్ని, పృథ్వీ క్షిపణి కార్యక్రమాలు, పోఖ్రాన్-II అణు పరీక్షల్లో కలాం కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ శాస్త్రీయ సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు అభివృద్ధి చెందిన భారత్ కోసం ఆయన కృషి చేశారని తెలిపారు.

సాధారణ నేపథ్యం గొప్ప లక్ష్యాలకు అడ్డంకి కాదని కలాం జీవితం నిరూపించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. జ్ఞానాన్ని నిజాయితీ, వినయం, సమాజ సేవతో మేళవించాలని సూచించారు. శాస్త్రీయ దృక్పథం, స్వావలంబన, నిరంతర అభ్యాసం వంటి విలువలను అలవర్చుకుని, దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారత్‌ కోసం కలాం కన్న కలలను సాకారం చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here