కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 చ.గజాల నివాస స్థలాన్ని అందజేసిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Donates 62 Square Yards Residential Land For KBR Park Elevated Corridor

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దడికి శాశ్వత పరిష్కారం చూపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రోడ్డు విస్తరణ మరియు జంక్షన్ల అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు శబ్దాలయ స్టూడియో, భవ్య కన్‍స్ట్రక్షన్స్ యజమానులు తమ విలువైన స్థలాలను ప్రభుత్వ రోడ్డు విస్తరణ నిమిత్తం స్వచ్ఛందంగా అప్పగించేందుకు ముందుకు వచ్చారు.

బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే మార్గంలో రద్దడి ఎక్కువగా ఉండే రోడ్డు నంబరు 45 కూడలి అభివృద్ధికి నటుడు బాలకృష్ణ నివాసానికి సంబంధించిన స్థలాన్ని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ తన నివాస స్థలంలో నుండి 862.77 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తరామారావు (NTR) 1982లో ఈ నివాసాన్ని నిర్మించగా, అప్పట్లో ఎన్టీఆర్ ఇక్కడే తన అభిమానులను కలిసేవారు. నందమూరి కుటుంబంతోనూ, స్వయంగా బాలకృష్ణతోనూ ఎంతో భావోద్వేగ అనుబంధం, సెంటిమెంట్ ఉన్న ఈ ఇంటికి సంబంధించి గణనీయమైన భాగం రోడ్డు విస్తరణలో కోల్పోనున్నారు.

ఈ పనుల కారణంగా ఆయన ఆ ఇల్లును వీడి వేరే ప్రాంతానికి మారాల్సి వస్తున్నప్పటికీ, ప్రజాప్రయోజనాలను, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆయన భూమిని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. నగరం నడిబొడ్డున గజం విలువ రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు పలికే ఈ ప్రాంతంలో, నగదు నష్టపరిహారానికి బదులుగా ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్ (Transferable Development Rights – TDR) బాండ్లను తీసుకునేందుకు యజమానులు అంగీకరించారు.

ఇదే ప్రాజెక్ట్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు వద్ద జంక్షన్ అభివృద్ధి కోసం శబ్దాలయ స్టూడియో భూమి నుంచి 608 గజాలు, అలాగే ఫిల్మ్‌నగర్ జంక్షన్ అభివృద్ధికి సంబంధించి భవ్య కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన 341.33 గజాల స్థలాన్ని సేకరిస్తున్నారు. ఈ మూడు ప్రముఖ ఆస్తుల ద్వారా మొత్తం 1,812 గజాలకు పైగా స్థలం రోడ్డు విస్తరణ కింద అందనుండటంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here