కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, విపక్షాల కూటమి వ్యూహాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఓటములకు ఇతర వ్యవస్థలపై నిందలు వేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇటీవల ఎన్నికల ప్రక్రియ మరియు ఓటర్ల జాబితాలపై ‘సర్’ (స్పెషల్ సమ్మరీ రివిజన్) ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “ఎన్నికల సంస్కరణలు లేదా ‘సర్’ విధానం రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ వరసగా ఓడిపోతూనే ఉంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్కు లభించినవన్నీ పరాజయాలే. 2024 తర్వాతేగా సర్ అమల్లోకి వచ్చింది? మరి అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది?” అని ప్రశ్నించారు. విదేశీ చొరబాటుదారులను దేశంలో ఓటర్లుగా చేర్చాలనే రాహుల్ గాంధీ ఆలోచనల గురించి దేశ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని ఆయన ఆరోపించారు.
అలాగే ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కొద్దిమంది కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించినంత మాత్రాన అది దేశ ప్రజల వాణి కాబోదని అమిత్ షా స్పష్టం చేశారు. “ప్రజల నిజమైన మనోభావాలు తెలుసుకోవాలంటే పొలాలు, గ్రామాలు, కొండకోనల్లోకి వెళ్లాలి గానీ, రాహుల్ అక్కడకు వెళ్లలేరు. బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ను ఇప్పటికే పూర్తిగా తిరస్కరించారు” అని ఎద్దేవా చేశారు.
రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగోసారి ఓటమిపాలు కాక తప్పదని హోంశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తన ఓటములను సమీక్షించుకోకుండా వ్యవస్థలపై నెపం నెట్టడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.










































