దిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ ప్రదేశాన్ని అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి దిల్లీ పోలీసులు తొలగించడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం మరియు దిల్లీ పోలీసుల ఈ నిర్ణయంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన నానమ్మ అంత్యక్రియల సందర్భంగా మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని శాంతుక్ పింప్రికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. “వారు (కేంద్రం) జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలం జాబితా నుంచి తొలగించారు. అవును, అది ఇకపై నిరసన స్థలం కాదు.. ఏదేమైనా ఒక పిరికి నియంత దానిని యుద్ధ క్షేత్రంగా మార్చేశారు. ఇకపై దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ.. “ఈ రోజు ప్రధాని మోదీ జంతర్ మంతర్‌కు ఉన్న నిరసన ప్రదేశం హోదాను రద్దు చేశారు, రేపు ఆయన ప్రజాస్వామ్యాన్నే రద్దు చేస్తారు. ఆ నియంతకు అసలు సమస్య నిరసన ప్రదేశం కానే కాదు.. ప్రజలు ప్రశ్నించడం, నిరసన తెలపడం అనే భావనే ఆయనకు ప్రధాన సమస్య” అని మండిపడ్డారు.
ఇక మరోవైపు జంతర్ మంతర్‌ను డీ-నోటిఫై చేయడాన్ని పలువురు విపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలు కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఇది పౌరుల ప్రాథమిక హక్కులపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.








































