భారతీయ సంస్కృతిని తర్వాతి తరాలకు అందించాలి – చిన్మయ అమృత మహోత్సవంలో ప్రధాని మోదీ

PM Modi Inaugurates Chinmaya Amrit Mahotsav Global Sammelan in Delhi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ సమ్మేళనాన్ని అక్టోబర్ 23న ప్రారంభించారు. చిన్మయ మిషన్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల నుంచి 9,000 మందికి పైగా పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, యువత పాత్ర, జాతీయ అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

చిన్మయ మిషన్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఆలోచనా ఉద్యమమని మోదీ పేర్కొన్నారు. స్వామి చిన్మయానంద బోధనలు, భగవద్గీత, ఉపనిషత్తుల సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మిషన్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఆధ్యాత్మిక వికాసం వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా దేశ పురోగతికి కూడా దోహదపడాలని అభిప్రాయపడ్డారు.

చిన్మయ మిషన్ ద్వారా లక్షలాది మంది యువత భారతీయ సంస్కృతికి ప్రతినిధులుగా నిలుస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. యువతలో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని పెంపొందించడం అవసరమని సూచించారు. మిషన్‌కు అనుబంధంగా దేశవ్యాప్తంగా వందకు పైగా విద్యాసంస్థలు విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు భారతీయ విలువలను అందిస్తున్నాయని వివరించారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. అదే సమయంలో చిన్మయ మిషన్ శతాబ్ది ప్రస్థానం కూడా ఆ దశకు చేరుకుంటుందని గుర్తుచేశారు. సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై, స్వావలంబనను ప్రోత్సహిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. చిన్మయ మిషన్ ఆధ్యాత్మిక సేవలు, భారతీయ వారసత్వ పరిరక్షణ దేశానికి మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here