బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం, తుపాను ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను మరింత బలపడి సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశాలపై అంచనాల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను తీరం దాటే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
‘చెప్పాం.. చేస్తున్నాం’ నినాదంతో ప్రచారం
ప్రస్తుత అంచనాల ప్రకారం కోనసీమ–యానాం–కాకినాడ ప్రాంతాల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలతో పాటు కోనసీమ, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై గాలులు, వర్షాల ప్రభావం ఉండవచ్చని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అంచనా వేశారు.
ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వివరించారు. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించడం వంటి అంశాలపై సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్ధరించేలా సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే లక్ష్యంగా సహాయక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.




































