తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ ఊరట

Telangana Housing Board Plans Bank Loans For Indiramma Housing Scheme Beneficiaries

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు/ఫ్లాట్లు పొందే లబ్ధిదారులకు ప్రభుత్వం మరో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు బ్యాంకుల ద్వారా రుణసౌకర్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాట్‌మెంట్ ధర అయిన రూ.6 లక్షల ప్రాతిపదికన ఈ రుణాలను మంజూరు చేసేలా బ్యాంకర్లతో సమన్వయం చేస్తుండటం విశేషం.

ఈ రూ.6 లక్షల మొత్తాన్ని లబ్ధిదారులు ఒకేసారి కాకుండా సులభ వాయిదాల పద్ధతిలో చెల్లించేలా హౌసింగ్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీని ప్రకారం.. తొలి విడతగా ఫ్లాట్ కేటాయించినప్పుడు లబ్ధిదారులు రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం రెండో విడతలో రూ.2 లక్షలు, మూడో విడత నిర్మాణ సమయంలో మరో రూ.2 లక్షలు చెల్లించాలి. చివరగా ఫ్లాట్‌ను లబ్ధిదారునికి పూర్తిగా అప్పగించే (హ్యాండోవర్) సమయంలో మిగిలిన రూ.1 లక్షను చెల్లించేలా విడతల వారీగా అవకాశం కల్పించారు.

ఇక ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులపై ఎలాంటిదనపు భారం పడకుండా, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఏవీ ఉండవని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పేదలు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, వాయిదాల పద్ధతి ద్వారా పేద కుటుంబాలకు చెల్లింపులు సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

మంత్రి ప్రకటనతో లబ్ధిదారులకు పక్కా గృహాల కేటాయింపు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. బ్యాంకు రుణాలు మరియు విడతల వారీగా చెల్లింపుల వెసులుబాటుతో సొంతింటి స్వప్నం నెరవేరుతుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here