గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజమండ్రి నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటుకు బీజం పడిందని, ఆ ఐక్యతే 2024 ఎన్నికల్లో ఘన విజయానికి దోహదపడిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు.
బీ-ఫారం పొందిన అభ్యర్థులకే మద్దతివ్వాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అధికారిక బీ-ఫారం పొందిన అభ్యర్థులనే గెలిపించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ ఎన్నికలను తమ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చే తీర్పుగా భావిస్తున్నామని, 2024 ఎన్నికల కంటే అధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు నగర బహిష్కరణ చేశారని ఆరోపించారు. తనను కూడా నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి వేధించారని విమర్శించారు. 2019–2024 మధ్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదని అన్నారు.
జగన్ జమానాలో గాడి తప్పిన వ్యవస్థలు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల భూములకు ముప్పు ఏర్పడిందని ఆరోపించిన చంద్రబాబు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. కేంద్ర పథకాల నిధుల మళ్లింపు జరిగిందని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం వాటిని తిరిగి పునరుద్ధరించిందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే అవకాశాలు మెరుగుపడతాయని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు రాయలసీమలో నీటి లభ్యతను పెంచేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మరోవైపు, జగన్ హింసను విడనాడి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో 97 శాతం పంటల సాగు జరిగిందని చంద్రబాబు వెల్లడించారు.










































