దేశంలో జరుగుతున్నది సాధారణ ఓట్ చోరీ కాదు – కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్

LoP Rahul Gandhi Leads INDIA Bloc March in New Delhi, Demands CEC Gyanesh Kumar's Resignation

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘ఇండియా’ (INDIA) కూటమి శ్రేణులు దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ఓటర్ల జాబితాలోని అక్రమాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన కూటమి నాయకులు, ఢిల్లీ వీధుల్లో ర్యాలీగా తరలివెళ్లడంతో రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఢిల్లీని ఒక కోటలా మార్చి ప్రజలను నిరసనలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అయినప్పటికీ, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాము వెనకడుగు వేసేది లేదని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు వైపు మార్చ్‌గా సాగారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటర్ల తొలగింపు మరియు సవరణల విషయంలో పారదర్శకత కొరవడిందని, స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు.

జ్ఞానేష్ కుమార్ పదవికి రాజీనామా చేసి, ఎన్నికల వ్యవస్థలో జరిగిన అక్రమాలపై అప్రూవర్‌గా మారాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే తమ కూటమి ఈ పోరాటాన్ని ఉధృతం చేసిందని స్పష్టం చేశారు.

ఇక విపక్షాల నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కనౌట్ ప్లేస్, మింటో రోడ్, జంతర్ మంతర్ తదితర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, ప్రదర్శనకారులను అడ్డుకునే యత్నం చేయడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.

కాగా, ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం మరియు అధికార భాజపా తీవ్రంగా స్పందించాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేశాయి. ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నగరంలో అలజడి సృష్టిస్తున్నాయని మండిపడ్డాయి. ఇరువర్గాల మధ్య ఐదువారాలుగా నడుస్తున్న ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here