తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న కొన్ని రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు.
ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మంగళ మరియు బుధవారాల్లో నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల సూచన ఉన్న జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేశారు.
ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. నగరాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పంట కోతల సమయంలో వర్ష సూచన ఉండటంతో ధాన్యం తడవకుండా రైతులు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.








































