రేపే ఏపీ పుర పోరు: కూటమిలో ధీమా.. వైసీపీకి ప్రతిష్ఠాత్మకం, సర్వత్రా ఉత్కంఠ

AP Municipal Elections 13 Corporations and 79 Municipalities Poll Tomorrow

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. నవంబరు 1 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార హోరు ముగిసింది.

మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు మొదట నోటిఫికేషన్ విడుదల కాగా, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, దర్శి, ప్రొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, ఆళ్లగడ్డ వంటి 8 చోట్ల ఛైర్‌పర్సన్‌తో పాటు అన్ని వార్డులు పూర్తి స్థాయిలో ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 92 పట్టణ స్థానిక సంస్థల్లోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది.

ఇక ఈ ఎన్నికల కోసం అధికారులు మొత్తం 4,372 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన ఎలక్ట్రానిక్ యంత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి తరలింపు పనులను శనివారం ఉదయమే అధికారులు పూర్తి చేశారు.

ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు మరియు ఛైర్‌పర్సన్లను ఓటర్లు నేరుగా ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని అమలు చేస్తుండటం విశేషం. దీనివల్ల ప్రతి ఓటరు మేయర్/ఛైర్‌పర్సన్ అభ్యర్థికి ఒక ఓటు, తమ వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ అభ్యర్థికి మరో ఓటు చొప్పున మొత్తం రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.

13 నగరపాలక సంస్థల్లోని 804 డివిజన్లలో 3,073 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 79 మున్సిపాలిటీల్లోని 2,382 వార్డు స్థానాల్లో 6,669 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయనగరం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడం పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.

ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో నామినేషన్ల ఘట్టంలో వివాదాలు ఎదురైనందున సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ అభ్యర్థుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇక బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు 111 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయగా.. వీటి రక్షణ కోసం 4,655 మంది పోలీసులను కేటాయించారు. అలాగే, ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం 525 మందికి బాధ్యతలు అప్పగించగా.. కమ్యూనికేషన్ విభాగంలో మరో 500 మంది సిబ్బందినినియమించారు.

ఏకగ్రీవాల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధిపత్యం చాటుకోగా, మిగిలిన ప్రధాన స్థానాల్లోనూ విజయం సాధించి పట్టణ ప్రాంతాల్లో ప్రజామోదం ఉందని చాటాలని కూటమి భావిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష వైకాపా స్థానిక సమస్యలు, నామినేషన్ల నాటి వివాదాలను అస్త్రాలుగా చేసుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రమించింది. నవంబరు 1న పూర్తికానున్న పోలింగ్ అనంతరం, నవంబరు 3న చేపట్టే ఓట్ల లెక్కింపుతో పట్టణ ఓటర్ల తుది తీర్పు వెలువడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here