తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర ఏ సర్వే చేయించుకున్నా అభ్యంతరం లేదు – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Says, Maharashtra Free to Conduct Any Survey on Submergence of Tummidihatti Barrage

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ అంశంపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత నెలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన చర్చల పురోగతిని సమీక్షించిన సీఎం, ప్రాజెక్టు నిర్మాణ విషయంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్న ప్రధాన అంశాలు:

  • నిర్మాణ ప్రాంతంలో మార్పు లేదు: తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ స్థలంలో ఎలాంటి మార్పు ఉండదని, ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. డిజైన్‌లో మార్పు చేయడం వల్ల ముంపు మాత్రమే తగ్గిందని, ప్రాదేశిక ప్రాంతం యథావిధిగా ఉంటుందని తెలిపారు.

  • మహారాష్ట్రతో సంప్రదింపులు: బ్యారేజీ నిర్మాణం, ఎత్తు పెంపు తదితర అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. 148 మరియు 152 మీటర్ల ఎత్తుల వద్ద బ్యారేజీ నిర్మించినప్పుడు ఉండే ముంపు ప్రాంతాల వివరాలపై పూర్తి స్పష్టతతో సిద్ధంగా ఉండాలన్నారు.

  • ముంపు భూములకు పరిహారం: మహారాష్ట్ర పరిధిలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన నిధులను మహారాష్ట్రతో కూడిన జాయింట్ బ్యాంక్ ఖాతాలో ఉంచుతామని తెలిపారు.

  • సర్వేలకు అనుమతి: ముంపు భూముల విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సర్వే చేయించుకున్న తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ రాష్ట్ర అధికారులకు కావాల్సిన సమగ్ర సమాచారాన్ని ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే అన్ని అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీ రమేష్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here