పుర పోరులో సత్తా చాటిన జనసేన.. మరోసారి 100% స్ట్రైక్‌రేట్ నమోదు

Jana Sena Achieves 100% Strike Rate Once Again in AP Municipal Elections

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ మరోసారి తన సత్తా చాటుతూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 2024లో జరిగిన సార్వత్రిక శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించిన జనసేన, తాజాగా జరిగిన ‘పుర’ పోరులోనూ అదే జోరును కొనసాగించి వంద శాతం స్ట్రైక్‌రేట్‌ను పునరావృతం చేసింది.

కూటమి పొత్తులో భాగంగా బరిలోకి దిగిన జనసేన అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి పార్టీ పట్టును మరింత నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం గెలుపులకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో పార్టీని కొత్త ప్రాంతాలకు, మరింత విస్తరించే వ్యూహంతో అడుగులు వేసింది. పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలలోని కీలక స్థానాలను కైవసం చేసుకుంది.

ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పురపాలికలో జనసేన చైర్మన్ అభ్యర్థి దానం లాజర్‌బాబు అఖండ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే విజయవాడ కార్పొరేషన్ మేయర్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను బరిలోకి నిలపడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమేకాక, ప్రధాన నగరంలో బలమైన పునాదిని వేసుకుంది.

తుని, పెద్దాపురం (సామర్లకోట), అమలాపురం, ముమ్మిడివరం, తెనాలి, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, చిలకలూరిపేట, తిరువూరు, పెడన, దర్శి, పుట్టపర్తి, మడకశిర, పుత్తూరు వంటి ప్రాంతాల్లో పార్టీ విస్తరణకు ఈ ఎన్నికలు ఎంతగానో దోహదపడ్డాయి. కొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అవకాశం కల్పించినప్పటికీ, కూటమి సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ సజావుగా జరిగిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన సాధించిన ఈ వరుస విజయాలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here