పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లో అన్ని వివరాలు

EPFO Rolls Out WhatsApp Services for PF Balance and Passbook

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు సేవలను మరింత వేగంగా, సులభంగా అందించే దిశగా కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన వేడుకల్లో వాట్సాప్‌ ఆధారిత పీఎఫ్‌ సేవలను మరియు క్రియారహిత ఖాతాల ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ విధానాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.

ఇకపై పీఎఫ్‌ సేవలు మరియు వివరాల కోసం సభ్యులు పోర్టల్‌లలో లాగిన్ కావాల్సిన లేదా ఈపీఎఫ్‌వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్‌వో ధ్రువీకరించిన అధికారిక వాట్సాప్‌ సేవ ద్వారా సభ్యులు తమ పీఎఫ్‌ ఖాతాలోని మొత్తం నిల్వ (బ్యాలెన్స్‌), ఇటీవల జరిగిన ఐదు లావాదేవీల వివరాలు, మరియు పీఎఫ్‌ పాస్‌బుక్‌ సమాచారాన్ని నేరుగా ఫోన్లోనే సులభంగా పొందవచ్చు.

దీనితో పాటు ‘ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ కింద ప్రక్రియలు పూర్తి చేయడానికి కూడా ఈ వాట్సాప్ చాట్‌బాట్ సేవలు సహాయపడనున్నాయి. సాంకేతికత ఆధారితంగా తీసుకొచ్చిన ఈ వినూత్న సేవలతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగులకు తక్షణ ఉపశమనం లభించనుంది.

మరో ప్రధాన నిర్ణయంగా, పీఎఫ్‌ ఖాతాల్లో చిన్న మొత్తాలు ఉండిపోయి దీర్ఘకాలంగా క్రియారహితంగా మారిన ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో ఊరటనిచ్చింది. ఆధార్‌ ధ్రువీకరణ పూర్తయి, రూ.1,000 లేదా అంతకంటే తక్కువ నిల్వ ఉన్న క్రియారహిత ఖాతాలను ఎటువంటి క్లెయిమ్‌ దరఖాస్తు లేకుండానే ఆటోమేటిక్‌గా సెటిల్‌ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు లక్ష ఖాతాదారులకు చెందిన రూ.5 కోట్ల మేర నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరనున్నాయి.

ఈపీఎఫ్‌వో 74 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రస్తుతం 8 కోట్లకు పైగా చందాదారులతో రూ.32 లక్షల కోట్ల భారీ నిధి సంస్థ వద్ద సమకూరిందని మంత్రి మాండవీయ పేర్కొన్నారు. రాబోయే 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచి, ప్రజానుకూల సేవలు అందించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here