తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ ఏడాది దీపావళి వేడుకలు సరికొత్త కాంతులతో నిండాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి!’ అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పండుగ జరుపుకున్నారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంట్లో పాల్గొని లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోవడం విశేషం.
పర్సాపూర్కు చేరుకున్న ముఖ్యమంత్రి, స్థానిక లబ్ధిదారులు గోరిపల్లి సుమిత్ర – శ్రీనివాస్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ దంపతులకు నూతన వస్త్రాలను అందించిన సీఎం, పండుగ వేళ కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న వారి ముఖాల్లోని ఆనందాన్ని పంచుకున్నారు.
అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్కలతో కలిసి లబ్ధిదారుని ఇంట్లోనే సన్నబియ్యంతో వండిన రుచికరమైన భోజనాన్ని స్వీకరించారు.
ఈ పర్యటన కేవలం ఒక ఇంటి ప్రారంభోత్సవానికే పరిమితం కాకుండా పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబించింది. భోజనం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్న స్థానిక చిన్నారులతో కలిసి ఉత్సాహంగా దీపావళి టపాసులు కాల్చారు. పిల్లలందరికీ స్వయంగా పెన్నులను బహూకరించి వారిని పండుగ సంతోషంలో ముంచెత్తారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నిరుపేదల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. తొలి విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న 2 లక్షలకు పైగా కుటుంబాల గృహాల్లో దీపాల వెలుగులు నింపాలనే సంకల్పంతోనే ఈ ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ తమ ప్రాంతాల్లో నిర్మాణమైన ఇందిరమ్మ ఇళ్ల వద్ద పండుగ వేడుకల్లో పాల్గొని పేదల పట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు.









































