నీట్ పీజీ (NEET-PG), నీట్ సూపర్ స్పెషాలిటీ (NEET-SS) కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా జాతీయ వైద్య కమిషన్ (NMC) మరియు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న పర్సంటైల్ ఆధారిత అర్హత ప్రమాణాలను రద్దు చేసి, 2027 విద్యా సంవత్సరం నుంచి ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని 12 మంది నిపుణులతో కూడిన కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సిఫారసు చేసింది.
ఈ ప్రతిపాదనలకు ఎన్‌ఎమ్‌సీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పీజీ మెడిసిన్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌లో పదే పదే కటాఫ్ పర్సంటైల్‌ను సున్నా వరకు తగ్గించడం వల్ల వైద్యవిద్య నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందన్న ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేవలం సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయన్న నెపంతో అర్హత ప్రమాణాలకు పూర్తిగా మినహాయింపులు (రిలాక్సేషన్) ఇవ్వడం సరైన పద్ధతి కాదని కమిటీ స్పష్టం చేసింది.
కమిటీ చేసిన ప్రధాన సిఫారసులు:
-
ర్యాంక్ ఆధారిత ఎంపిక: 2027 నుంచి పర్సంటైల్ రద్దు చేసి, సాధించిన మెరిట్ ర్యాంకు ప్రాతిపదికనే సీట్లు కేటాయించడం.
-
నాన్-క్లినికల్ కోర్సులకు ఊతం: ప్రీ-క్లినికల్, పారా-క్లినికల్ పీజీ విభాగాను ఎంచుకునే విద్యార్థులకు సర్వీస్ బాండ్ల నుంచి మినహాయింపు ఇవ్వడం మరియు ఆ కోర్సుల ఫీజులను గణనీయంగా తగ్గించడం.
-
సీట్ల దుర్వినియోగం అడ్డుకట్ట: కౌన్సెలింగ్‌లో జాప్యాన్ని నివారించి, ప్రవేశాల ప్రక్రియలో సీట్ బ్లాకింగ్‌ను నిరోధించేందుకు కేవైసీ (KYC) లేదా బయోమెట్రిక్ విధానాలను అమలు చేయడం.
ఈ సమగ్ర నివేదికపై తమ అభిప్రాయాలను మరియు అభ్యంతరాలను సమర్పించేందుకు పిటిషనర్లకు సుప్రీంకోర్టు గడువునిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది. విధివిధానాలు పూర్తిగా ఖరారైన తర్వాత 2027 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.







































