నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరలకు కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు మార్కెట్ జోక్య పథకం కింద రాబోయే మూడు నెలలకు నెలకు రూ.100.20 కోట్ల చొప్పున మొత్తం రూ.300.60 కోట్ల రాయితీని కేటాయించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పును రూ.100కు, కిలో గోధుమపిండిని రూ.25కు అందించనున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. అర్హులైన రేషన్ కార్డుదారులకు ఈ సరుకులు అందుబాటులోకి రానున్నాయి.
ధరల స్థిరీకరణ నిధి కింద రాష్ట్రానికి 1.20 లక్షల టన్నుల కందులను కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం తొలి విడతగా 40,338 టన్నుల కందులను కేటాయించింది. ఈ నిల్వలను వినియోగించుకుని ప్రజలకు సరసమైన ధరలకు కందిపప్పు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ జోక్యంతో వినియోగదారులకు తక్కువ ధరలకు సరుకులు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన సరుకులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.









































