రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుండి 10+2 విధానం అమలు

CM Revanth Reddy Unveils New 10+2 Education Structure For Telangana From Next Academic Year

తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ విధానానికి బదులుగా ’10+2 విధానం’ అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు బుధవారం విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయడాన్ని (డ్రాపౌట్లు) అరికట్టేందుకు, దేశంలోని 18 రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షలో భాగంగా విద్యా విధానంలో చేపట్టాల్సిన మార్పులపై సీఎం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్యగా, 9వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ వరకు ‘సీనియర్ సెకండరీ’ (10+2) విద్యా విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.

పదో తరగతి పూర్తయిన తర్వాత ముఖ్యంగా బాలికలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఎక్కువగా చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, కేజీబీవీల తరహాలోనే పాఠశాల, ఇంటర్‌ విద్యను విలీనం చేయడం ద్వారా డ్రాపౌట్లను పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకులు, సిబ్బంది ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

పాఠశాలల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ వసతి గృహం లేదా రెసిడెన్షియల్ స్కూల్ కూడా అద్దె భవనాలలో కొనసాగడానికి వీల్లేదని, పూర్తి వసతులతో కూడిన సొంత భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజుతో పాటు పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here