మోదీ ప్రభుత్వం నా ఫోన్‌ ట్యాప్ చేయిస్తోంది – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

LoP Rahul Gandhi Sensational Allegations on PM Modi Govt Over Tapping His Phone

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తోందని, ఈ విషయం స్వయంగా ప్రధానమంత్రికి కూడా తెలుసని సంచలన ఆరోపణలు చేశారు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ మీ’ ఆన్‌లైన్ చర్చాగోష్టిలో మరియు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన వీడియోల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.

తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను పైకి చూపుతూ, ప్రధాని మోదీపై తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన ఫోన్‌లోనే ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇద్దరిలో ‘ఎవరు దేశద్రోహి?’ అనే విషయాన్ని తేల్చేందుకు ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీ మరోసారి సవాలు విసిరారు. గత 12 రోజుల్లో ఆయన ప్రధానిని చర్చకు ఆహ్వానించడం ఇది ఏడోసారి. ముఖాముఖి చర్చ జరిగితే విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరు ఉన్నారో, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడుతున్నారో దేశ ప్రజలకు స్పష్టమవుతుందని ఆయన అన్నారు.

ఈ బహిరంగ చర్చకు న్యాయనిర్ణేతలుగా గౌతమ్ అదానీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నా తనకు అభ్యంతరం లేదని, కావాలంటే ప్రధాని తన వెంట టెలిప్రాంప్టర్‌ను కూడా తెచ్చుకోవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు. తనతో ముఖాముఖి చర్చిస్తే మోదీ ప్రధాని పదవిలో కొనసాగలేరని, ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రధాని తీవ్ర ఒత్తిడిలో, భయంలో ఉన్నందువల్లే మునుపటిలా తనపై వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇదే కార్యక్రమంలో సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ లవ్ ఆఫ్ జర్నీ’పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, ఆ పుస్తకంపై ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత మంచిదని, బీజేపీ నేతల్లోనూ చాలామంది సోనియా గాంధీని అభిమానిస్తారని రాహుల్ పేర్కొన్నారు.

మరోవైపు, రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీకి రోజూ ఏదో ఒక అబద్ధం చెప్పడం అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా విమర్శించారు. అలాగే బహిరంగ చర్చ సవాలును తిరస్కరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చర్చలకు పార్లమెంటు వేదికగా ఉండనే ఉందని, లోక్‌సభలో జరగనున్న చర్చల నుంచి రాహుల్ తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here