టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

Veteran Telugu Actor, Director and Producer Giri Babu Passed Away

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభార మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు.

ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. 1946 జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. చిన్నతనం నుంచే సినిమాలపై మక్కువ పెంచుకున్న ఆయన, తొలుత నాటక రంగంలో అనుభవం గడించి సొంతంగా నాటక సమాజాన్ని కూడా స్థాపించారు.

1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో 600లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో ఒదిగిపోయి నటించిన గిరిబాబుకు ‘జ్యోతి’, ‘కురుక్షేత్రం’, ‘భైరవద్వీపం’, ‘అల్లుడా మజాకా’, ‘హలో బ్రదర్’, ‘అతడు’, ‘నువ్వేకావాలి’, ‘అ.. ఆ’, ‘గీత గోవిందం’ వంటి ఎన్నో చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

ఇక నటుడిగానే కాకుండా ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజిత్’ వంటి చిత్రాలకు నిర్మాతగా, ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుకున్నా’ సినిమాలకు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ ఆయన నటించిన చివరి చిత్రం.

గిరిబాబు సతీమణి శ్రీదేవి 2016లోనే అనారోగ్యంతో మరణించగా, ఆయనకు కుమారులు రఘుబాబు, బోసుబాబు ఉన్నారు. తండ్రి బాటలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రఘుబాబు ప్రముఖ హాస్యనటుడిగా రాణిస్తున్నారు. గిరిబాబు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పలువురు సినీ పెద్దలు నివాళులర్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here