డ్రగ్స్‌ రహిత భారత్ కోసం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మహా సంకల్పం

Union Minister Kishan Reddy To Launch Three-Day Anti-Drug Padayatra Nasha Mukt Bharat

డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడుకోవడమే లక్ష్యం.. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మించాలనే ధ్యేయంతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి ఒక మహా సంకల్పం తీసుకున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరంలో మూడు రోజుల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

యువతను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించి, దేశాభివృద్ధిలో వారి పాత్రను మరింత బలోపేతం చేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ పాదయాత్రకు సన్నాహకంగా ఇటీవల హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన ‘డ్రగ్స్ రహిత భారత్’ సదస్సులో కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై పోరాడిన తరహాలోనే ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారిపై కూడా సమష్టి యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశానికి యువతే అతిపెద్ద ఆస్తి అని, ప్రపంచం నేడు భారత యువత మేధస్సు, నైపుణ్యాల వైపు చూస్తోందని చెప్పిన కేంద్ర మంత్రి.. పెట్టుబడులు, ఐటీ రంగం, డేటా సెంటర్లకు భారత్ కీలక కేంద్రంగా ఎదుగుతున్న సమయంలో మత్తుపదార్థాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు.

గతంలో పంజాబ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన డ్రగ్స్ ముప్పు ఇప్పుడు హర్యానా, ఉత్తరప్రదేశ్ మీదుగా తెలుగు రాష్ట్రాలకూ విస్తరిస్తోందని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బస్తీల నుంచి ఐటీ కారిడార్ల వరకు ఈ సమస్య కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత, సామాజిక సంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

కాగా, నవంబర్ 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్న ఈ పాదయాత్రలో విద్యార్థులు, యువత వేలాదిగా పాల్గొననున్నారు. అలాగే, ఈ బృహత్ కార్యంలో వీరితో పాటుగా అనేకమంది సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కిషన్ రెడ్డితో అడుగేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here