బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మరోసారి మండి పడ్డారు. తమ హయాంలో సంపదను ఎలా పెంచాలో ఆలోచనలు చేశామని చెప్పుకొచ్చారు. బంగారు బాతును చేతిలో పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మండిపడ్డారు. హైడ్రా దెబ్బకు నగరంలో సొంతింటి కలలు నెరవరలేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చర్యలతో రియల్ బూమ్ పడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కక్కుర్తి నిర్ణయాలతో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయని విమర్శించారు. రేవంత్ పాలనలో రాష్ట్రానికి ప్రతీరోజు నష్టాలను తెచ్చిపెడుతోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
సంపద పెంచే ఆలోచనలు మావి – ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి. మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పేడితిరి. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న – పాతవి అమ్మాలన్న భయమే. నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే. నీ మూసి ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే. కాసుల పై నీ కక్కుర్తి నిర్ణయాలు – రాష్ట్రని అధోగతిపాలు చెయ్యబట్టే. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు – నేడు విలవిలలాడుతూ బోసిపోయే. నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే. బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్బాగ్యపు పాలనకు ఇదిగో ఈ ఏప్రిల్ నుండి అక్టోబర్ లెక్కలే సాక్ష్యాలు అని మండిపడ్డారు.
మరో ట్వీట్లో రైతుల అంశాలను ప్రస్తావిస్తూ దసరాకే కాదు.. దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా.. ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే.. ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే!రాజకీయాలపై పెట్టిన దృష్టి.. ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు? మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి..రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి.. దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయకండని కేటీఆర్ ట్వీట్ చేశారు.