న్యాయస్థానంలో జరిగే విచారణల అనధికార రికార్డింగ్ మరియు ప్రసారాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం (నవంబర్ 25) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికల్లో విచారణలకు సంబంధించిన లైవ్ ప్రసారాలు, వీడియోల అప్‌లోడింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. న్యాయస్థాన గౌరవం, పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు.
ప్రత్యక్షంగా జరిగే విచారణలతో పాటు వర్చువల్‌గా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ విచారణల రికార్డింగ్‌కు కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి అని హైకోర్టు పేర్కొంది. విచారణలను అనధికారికంగా రికార్డ్ చేయడం, ప్రసారం చేయడాన్ని తప్పుబడుతూ, సంబంధిత అధికారి ముందస్తు అనుమతి లేకుండా ఆడియో, వీడియో, ఫొటోలు లేదా స్క్రీన్‌షాట్లు తీయడాన్ని పూర్తిగా నిషేధించింది.
టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు మెసేజింగ్ యాప్‌లలో కోర్టు విచారణలను లైవ్‌లో ఇవ్వడం లేదా వీడియోలను అప్‌లోడ్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులు మరియు కోర్టు సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు (W.P. (Civil) No. 751 of 2026) మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించినా, అనధికారికంగా ప్రసారాలు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.





































