యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాలు, డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌లో పాదయాత్ర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఇండియా’ పేరుతో సాగే ఈ యాత్ర తొలిరోజు అంబర్‌పేట నుంచి ముషీరాబాద్ వైపు కొనసాగింది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు కిషన్ రెడ్డి అంబర్‌పేటలోని శ్రీ మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబర్‌పేట మైదానం వద్ద ప్రముఖ సినీ నటుడు ‘విక్టరీ’ వెంకటేష్ జెండా ఊపి పాదయాత్రను లాంఛనంగా ప్రారంభించగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు విద్యార్థులు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Kishan Reddy
View on X
ఇక ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న నటుడు వెంకటేష్ యువతకు, తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. “మత్తుపదార్థాలకు నో చెప్పి, జీవితానికి ఎస్ చెబుదాం. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనది, మత్తు వ్యసనం లేదా స్నేహితుల ఒత్తిడి (పీర్ ప్రెషర్) బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు” అని ఆయన పిలుపునిచ్చారు.
పిల్లలు, యువత మనసులోని ఆందోళనలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఓపికగా విని, వారికి అండగా నిలబడాలని సూచించారు. ఎవరైనా మత్తుపదార్థాల వ్యసనం నుంచి బయటపడాలనుకుంటే డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ నంబర్ 14446 సహాయం తీసుకోవాలని వెంకటేష్ కోరారు.
Venkatesh
View on X
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రాజకీయ కార్యక్రమం కాదని, సమాజం అందరూ కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘నషా ముక్త్ భారత్’ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే ప్రణాళిక సిద్ధం చేశామని, సుమారు 2,000 పునరావాస కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడుతూ, వాటిని అమ్మకుండా యువత క్రీడల వైపు మొగ్గుచూపేలా క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు వివిధ రంగాల ప్రముఖులు ఈ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న వారందరితో డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు.






































