దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సంస్థ బుధవారం (నవంబర్ 25) అధికారికంగా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌తో 11 ఏళ్లకు పైగా కొనసాగిన ఆయన సుదీర్ఘ ప్రస్థానం ముగియనుండగా, డిసెంబర్ 4 ఆయనకు చివరి పనిదినంగా ఉంటుందని సమాచారం. తదుపరి సీఈఓను రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు తాత్కాలికంగా సంస్థను నడిపించే బాధ్యతలను ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, కంపెనీ బోర్డు కలిసి నిర్వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగడానికి గల నిర్దిష్ట కారణాలను సంస్థ వెల్లడించనప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ (IPO) ప్రణాళికలు, వ్యూహాత్మక మార్పుల నేపథ్యంలో ఈ నాయకత్వ మార్పు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కల్యాణ్ కృష్ణమూర్తి నేతృత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం ఐదు రెట్లకు పైగా వృద్ధి చెందిందని, దేశవ్యాప్తంగా విస్తరించి బిగ్ బిలియన్ డేస్ వంటి ఈవెంట్లతో పండుగ షాపింగ్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని సంస్థ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ అభివృద్ధికి కల్యాణ్ అందించిన నాయకత్వం, గవర్నెన్స్ ప్రమాణాలకు వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌లో దీర్ఘకాలిక అవకాశాలు, ఫ్లిప్‌కార్ట్ పట్ల తమ నిబద్ధత యథాతథంగా కొనసాగుతుందని వాల్‌మార్ట్ స్పష్టం చేసింది.
తన ప్రస్థానంపై కల్యాణ్ కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేస్తూ, వ్యాపార విస్తరణతో పాటు నైతికత, సమగ్రత, పాలనా ప్రమాణాలతో సంస్థను నిర్మించిన తీరు పట్ల గర్వంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 50 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు, షాప్సీతో కలిపి 14 లక్షలకు పైగా సెల్లర్లతో కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్ ప్రయాణంపై వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.





































