వైసీపీ హయాంలో ‘గ్రూప్‌-1’ నిర్వహణలో అక్రమాలు నిజమే – సిట్‌ సంచలన నివేదిక

AP SIT Report on 2018 Group-1 Exam, Finds Multiple Irregularities in Evaluation and Interviews

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్‌-1 పరీక్షల వ్యవహారంలో పలు అవకతవకలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం నుంచి ఇంటర్వ్యూల వరకు పలు దశల్లో నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లు సిట్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ వ్యవహారంపై సిట్‌ 10,720 పేజీల సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించింది.

అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పాత్రపై కూడా సిట్‌ పలు అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మూడుసార్లు జరగగా.. ప్రతిదశలోనూ నిబంధనలకు విరుద్ధమైన చర్యలు చోటుచేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది.

మూడు దశల్లోనూ మూల్యాంకనంపై అభ్యంతరాలు

2018 డిసెంబరు 31న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. 2019 మే 26న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. 2020 డిసెంబరులో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి.

నిబంధనల ప్రకారం మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మాన్యువల్‌ విధానంలో జరగాల్సి ఉండగా.. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో డిజిటల్‌ మూల్యాంకనం చేపట్టారు. దీనిపై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మాన్యువల్‌ మూల్యాంకనం చేపట్టాలని కోర్టు ఆదేశించింది.

దీంతో 2021 అక్టోబరు నుంచి 2022 మే 19 వరకు మాన్యువల్‌ మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతం సవాంగ్‌ బాధ్యతలు చేపట్టడంతో మరోసారి మాన్యువల్‌ మూల్యాంకనం నిర్వహించారు. 2022 జూలై 5న తుది ఫలితాలను ప్రకటించారు. మొత్తం 325 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా.. 165 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

అయితే ఈ ప్రక్రియపై వచ్చిన ఆరోపణలు, న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో సిట్‌ దర్యాప్తు చేపట్టింది.

తొలి దశ: డిజిటల్‌ మూల్యాంకనంపై అభ్యంతరాలు

తొలి దశలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధానానికి భిన్నంగా ఏపీటీ ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ మూల్యాంకనం చేపట్టినట్లు సిట్‌ గుర్తించింది. సుమారు 48,442 జవాబు పత్రాలను స్కాన్‌ చేసి డిజిటల్‌ మూల్యాంకనానికి పంపారు.

ఈ ప్రక్రియలో బార్‌కోడ్‌లు తారుమారైనట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రూగ్రేడర్‌ ఎడ్యుసర్వీసెస్‌, స్టోన్‌ మీడియా అడ్వైజరీ సర్వీసెస్‌ అనే ప్రైవేటు సంస్థలను టెండర్లు లేకుండా ఎంపిక చేసినట్లు సిట్‌ పేర్కొంది.

మూల్యాంకనకర్తల ఎంపికలోనూ నిబంధనలు పాటించలేదని నివేదికలో ప్రస్తావించింది. కమిషన్‌ ఆమోదించిన జాబితాలో లేని మరో 25 మందిని కూడా మూల్యాంకనానికి ఉపయోగించినట్లు సిట్‌ గుర్తించింది. వీరిలో ప్రైవేటు లెక్చరర్లు, టీచర్లు ఉన్నట్లు తెలిపింది.

రెండో దశ: హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం

డిజిటల్‌ మూల్యాంకనం చెల్లదని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేపట్టారు. అయితే ఏపీపీఎస్సీ కార్యాలయం లేదా ప్రభుత్వ భవనాల్లో జరగాల్సిన ఈ ప్రక్రియను గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌కు తరలించినట్లు సిట్‌ పేర్కొంది.

సుమారు 84 రోజుల పాటు జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌లో ఉంచి మూల్యాంకనం చేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ వ్యవహారంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పాత్ర ఉన్నట్లు సిట్‌ పేర్కొంది.

మూల్యాంకనం కోసం 452 మంది సబ్జెక్ట్‌ నిపుణులను ఎంపిక చేసినప్పటికీ.. వారిని పూర్తిస్థాయిలో ఉపయోగించలేదని సిట్‌ గుర్తించింది.

టెన్త్‌, ఇంటర్‌ చదివినవారితోనూ మూల్యాంకనం

సిట్‌ నివేదికలోని అత్యంత కీలక అంశాల్లో ఇది ఒకటి. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివినవారు, టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, క్లర్క్‌లు, గృహిణులతో కూడా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించినట్లు దర్యాప్తులో తేలిందని సిట్‌ పేర్కొంది.

66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మూల్యాంకనంలో పాల్గొన్నట్లు, కొందరు ఎగ్జామినర్ల సంతకాలను కూడా వారే చేసినట్లు నివేదికలో ప్రస్తావించారు.

రెండో దశలో 736 జవాబు పత్రాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపగా.. వాటిలో వైట్‌నర్‌ వినియోగంతో పాటు పలు అనుమానాస్పద అంశాలను గుర్తించినట్లు సిట్‌ వెల్లడించింది. ఈ ప్రక్రియకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ అనుమతి లేదని కూడా నివేదికలో పేర్కొంది.

మూడో దశ: మార్కుల్లో మార్పులపై సిట్‌ గుర్తింపు

గౌతం సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి మాన్యువల్‌ మూల్యాంకనం నిర్వహించారు. ఈ దశలోనూ పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్‌ పేర్కొంది.

రెండో దశలో జవాబు పత్రాలపై సంతకాలు ఉండటంతో మూడో దశ కోసం సుమారు 49 వేల బార్‌కోడ్‌లను మళ్లీ ప్రింట్‌ చేయించారు. డేటా టెక్‌ అనే సంస్థ 48,442 బార్‌కోడ్‌లను సరఫరా చేసినట్లు నివేదికలో ఉంది.

మూడో దశలో 162 మంది నిపుణులను మూల్యాంకనానికి ఎంపిక చేశారు. అయితే తొలి దశలో ఇంటర్వ్యూలకు ఎంపికైన 202 మంది అభ్యర్థులు మూడో దశ ఫలితాల్లో లేకపోయినట్లు సిట్‌ గుర్తించింది.

28 శాతం జవాబు పత్రాల్లో వేరే ఇంకు

ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం జవాబు పత్రాల మూల్యాంకనంలో నిర్దేశించిన నీలం, నలుపు రంగు బాల్‌పాయింట్‌ పెన్నులనే ఉపయోగించాలి.

అయితే ఫోరెన్సిక్‌ పరిశీలనలో 736 జవాబు పత్రాల్లో 46 పత్రాలకు అనుమతించని ఇతర ఇంకు పెన్నులు ఉపయోగించినట్లు గుర్తించినట్లు సిట్‌ నివేదికలో పేర్కొంది.

అలాగే 736 పత్రాల్లో 718 ఓఎంఆర్‌ పత్రాల్లో మార్పులు ఉన్నట్లు గుర్తించారు. 89 మంది సంతకాలు సరిపోలలేదని నివేదికలో వెల్లడించారు.

చీఫ్‌ ఎగ్జామినర్లే మార్కులు మార్చారా?

మార్కుల్లో మార్పులు చేసే అధికారం నిబంధనల ప్రకారం వాల్యుయేటర్లకే ఉండాలి. అయితే 87 జవాబు పత్రాల్లో చీఫ్‌ ఎగ్జామినర్లు మార్కుల్లో మార్పులు చేసినట్లు సిట్‌ గుర్తించింది.

నిర్మల కుమారి, జి. సోమశేఖర్‌, వి. రవికుమార్‌, వై. వెంకటేశ్వర్లు, ఎ. మునిశంకర స్వామి వంటి ఎగ్జామినర్ల ప్రమేయం లేకుండానే కొన్ని పత్రాల్లో మార్కులు మార్చినట్లు నివేదికలో ప్రస్తావించారు.

అలాగే ఎస్‌. గోవర్ధన్‌ నాయుడు, నాగిరెడ్డి వెంకట రమణారెడ్డి, బీవీ మురళీధర్‌ అనే చీఫ్‌ ఎగ్జామినర్లు తమంతట తామే మార్కులు మార్చినట్లు సిట్‌ పేర్కొంది.

ఒక జవాబు పత్రంలో 13 మార్పులు చేయడంతో మార్కులు 105 నుంచి 89కి తగ్గినట్లు, మరో పత్రంలో 10 మార్పులతో 104 నుంచి 99కి తగ్గినట్లు నివేదికలో ఉంది. మరో అభ్యర్థి పత్రంలో మూడు మార్పులతో మార్కులు 111 నుంచి 110కి తగ్గినట్లు పేర్కొన్నారు.

బార్‌కోడ్‌ల విషయంలోనూ అనుమానాలు

ప్రతి జవాబు పత్రంలోని పేజీకి ప్రత్యేక బార్‌కోడ్‌ ఉంటుంది. తొలి పేజీలో అభ్యర్థి వివరాలు ఉంటాయి. అయితే కొందరు అభ్యర్థుల బార్‌కోడ్‌లు లోపలి పేజీలతో సరిపోలలేదని సిట్‌ గుర్తించింది.

అంతేకాకుండా మూల్యాంకనకర్తల వివరాలు గోప్యంగా ఉండాల్సి ఉన్నప్పటికీ.. 47 మంది వాల్యుయేటర్ల పేర్లు ముందుగానే సోషల్‌ మీడియాలో కనిపించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇంటర్వ్యూల్లోనూ భారీ వ్యత్యాసాలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల మధ్య అసాధారణ వ్యత్యాసాలు కనిపించినట్లు సిట్‌ నివేదికలో పేర్కొంది.

మెయిన్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన కొందరికి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రాగా.. మెయిన్స్‌లో తక్కువ మార్కులు సాధించిన కొందరికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినట్లు గుర్తించారు.

దీంతో కొందరి ర్యాంకులు భారీగా మారిపోయి ఉద్యోగాలపై ప్రభావం పడినట్లు సిట్‌ పేర్కొంది.

నివేదికలో ప్రస్తావించిన కొన్ని ఉదాహరణలు

  • 404 మెయిన్స్‌ మార్కులు సాధించిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 73 మార్కులు రావడంతో ర్యాంకు 215 నుంచి 161కి మెరుగైంది. ఎంపీడీవో ఉద్యోగం లభించింది.
  • 409.5 మార్కులు సాధించిన అభ్యర్థికి 72.5 ఇంటర్వ్యూ మార్కులు రావడంతో ర్యాంకు 186 నుంచి 133కు చేరింది. డీఎస్పీ ఉద్యోగం వచ్చింది.
  • 411.5 మార్కులు సాధించిన అభ్యర్థికి 73 ఇంటర్వ్యూ మార్కులు రావడంతో ర్యాంకు 167 నుంచి 133కి మారింది. ఎక్సైజ్‌ ఏఈఎస్‌ ఉద్యోగం లభించింది.
  • 414.5 మెయిన్స్‌ మార్కులు సాధించిన అభ్యర్థికి 72 ఇంటర్వ్యూ మార్కులు రావడంతో ర్యాంకు 151 నుంచి 94కు చేరింది. ఎక్సైజ్‌ ఏఈఎస్‌ ఉద్యోగం వచ్చింది.
  • మరోవైపు 446 మెయిన్స్‌ మార్కులు సాధించిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 49 మార్కులు మాత్రమే రావడంతో ర్యాంకు 14 నుంచి 55కు పడిపోయింది.
  • 440.5 మెయిన్స్‌ మార్కులు సాధించిన మరో అభ్యర్థికి 48 ఇంటర్వ్యూ మార్కులు రావడంతో ర్యాంకు 20 నుంచి 81కు పడిపోయింది.
  • 426.5 మార్కులు సాధించిన అభ్యర్థికి ఇంటర్వ్యూలో 53 మార్కులు రావడంతో ర్యాంకు 67 నుంచి 148కి పడిపోయి ఉద్యోగం రాలేదు.
  • 425.5 మెయిన్స్‌ మార్కులు సాధించిన మరో అభ్యర్థికి 47 ఇంటర్వ్యూ మార్కులు రావడంతో ర్యాంకు 72 నుంచి 192కి పడిపోయి ఉద్యోగం దక్కలేదు.

ఈ మార్కుల వ్యత్యాసాలపై సిట్‌ అనుమానాలు వ్యక్తం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

10,720 పేజీల నివేదికతో తదుపరి ఏంటి?

2018 గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, మెయిన్స్‌ మూల్యాంకనం, జవాబు పత్రాల్లో మార్పులు, బార్‌కోడ్‌ల వ్యవహారం, ఇంటర్వ్యూ మార్కుల్లో వ్యత్యాసాలు తదితర అంశాలపై సిట్‌ విస్తృతంగా దర్యాప్తు చేసింది.

10,720 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించడంతో ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో హైకోర్టు మెయిన్స్‌ పరీక్షలను రద్దు చేసి ఆరు నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించగా.. ఆ నిర్ణయంపై ఏపీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది.

ఇప్పుడు సిట్‌ నివేదికలోని అంశాలపై న్యాయస్థానం తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here