రాష్ట్రంలో ఇసుక కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ, భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు. విజయవాడలో గల ధర్నా చౌక్ వద్ద ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు నిరసన దీక్ష చేస్తున్నారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఇసుక కొరత సమస్యతో ఉపాధిలేక ఆత్మహత్య చేసుకున్న పలువురు భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రబాబు నిరసన దీక్ష కార్యక్రమానికి జనసేనతోపాటు వామపక్ష, బీజేపీ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. ఈ దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అసలు సమస్య లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇసుకను కూడా కబ్జా చేసి ఈ ప్రభుత్వం పెత్తనం చేస్తోందని, ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంటే, ఇంటి దొంగలు సీఎంకు కనపడరా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో కార్మికులంతా రోడ్డునపడ్డారని, 35 లక్షల మందికి ఇల్లు గడవని దుస్థితి కల్పించారన్నారు. ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు సెల్ఫీ వీడియోలు తీసి వారి బాధలు చెప్పుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. ఇసుక కొరత వలన సుమారు 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారు, ఇసుక సమస్య ఇంతవరకు ఎలా వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలోనే టీడీపీ హయాంలో మొదటిసారిగా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. ఉచిత ఇసుక పాలసీపై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక మాఫియాకు అప్పగిస్తారా? అని ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రస్తుత సమస్యలకు ఉచిత ఇసుక పాలసీనే పరిష్కారమని, ఇప్పటికే 50 మంది కార్మికులు చనిపోయినా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


