సరికొత్త పాలనా విధానాలను అనుసరించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల సమగ్ర మార్పు కోసం, రైతులకు గరిష్ఠ లాభాలు చేకూర్చేలా విప్లవాత్మకమైన మార్కెటింగ్ వ్యూహాలను ప్రకటించారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్ల ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే తక్కువ వ్యయంతో చేర్చేందుకు వీలుగా ‘ఫామ్ టూ హోం’ (Farm to Home) విధానానికి శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు మంగళవారం ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ప్రాథమిక రంగంలోని ఆరు మిషన్లపై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లక్ష కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్.. మదనపల్లెలో ఐఎస్‌ఏ
రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద ఉద్యాన (హార్టీకల్చర్) హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లతో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.40 వేల కోట్లతో ‘పూర్వోదయ’ పథకం కింద సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, గోదాములు వంటి మౌలిక వసతులు నిర్మిస్తుండగా, మరో రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించనున్నారు. రాయలసీమలో ప్రధాన పంట అయిన అరటికి కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
అలాగే జూలై నాటికి మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) స్థాపనకు శంకుస్థాపన చేస్తామని, పులివెందులలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను పూర్తి చేసేందుకు తక్షణమే రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా యాదవోలు వద్ద భారీ ‘కోకో సిటీ’ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.
రసాయన ఎరువుల కొరతకు విరుగుడుగా ప్రకృతి సేద్యం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం రసాయన ఎరువుల లభ్యత మరియు దిగుమతులపై పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు వీలుగా వారిని ప్రకృతి సేద్యం (Natural Farming) వైపు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతుబజార్లు మరియు ప్రైవేట్ మార్కెట్లలో ప్రకృతి సేద్యపు ఉత్పత్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
భూసార పరీక్షల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు, వ్యవసాయంలో డ్రోన్లు, హార్వెస్టర్లు, అధునాతన ఫార్మింగ్ యంత్రాల వినియోగాన్ని పెంచేందుకు రైతు సాధికార సంస్థ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎస్-హాఫ్‌మూన్ పద్ధతుల్లో సేద్యం జరిగేలా చూడాలన్నారు.
కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ.. మత్స్యకారులకు మెకనైజ్డ్ బోట్లు
రాష్ట్రంలో బ్లూ ఎకానమీని బలోపేతం చేసే దిశగా ఆక్వా మరియు మత్స్యకార రంగాలకు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీని, పాత 50 వేల కనెక్షన్లతో పాటు కొత్తగా నమోదైన 12,680 ఆక్వా కనెక్షన్లకూ వర్తింపజేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.188 కోట్ల భారం పడనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తేవాలని, సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల కోసం 200 మెకనైజ్డ్ బోట్లను నిధులతో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. వీటితో పాటు మరో 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతుబజార్లను ఏర్పాటు చేయాలని, ‘డిజి రైతుబజార్’ యాప్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు.





































