ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం అసెంబ్లీలో డీఎస్సీ నియామకాలపై మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా మెగా డీఎస్సీ నిర్వహించిందని తెలిపారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అయితే ఈ నియామక ప్రక్రియలో వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. “దమ్ముంటే అసెంబ్లీకి రండి.. డీఎస్సీపై చర్చిద్దాం” అంటూ సవాల్ చేశారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను పుస్తక రూపంలో ఎమ్మెల్యేలకు అందించామని తెలిపిన ఆయన, వచ్చే ఎన్నికలలోపు మరో 3 డీఎస్సీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
16,347 పోస్టులతో మెగా డీఎస్సీ
కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించిందని లోకేశ్ వెల్లడించారు. ఈ పోస్టుల కోసం 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు.
టీచర్ రిక్రూట్మెంట్ లేకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదని పేర్కొన్న మంత్రి.. మహిళలకు డీఎస్సీలో 33 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇప్పటివరకు 1.80 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించామని చెప్పారు.
వైసీపీ హయాంపై లోకేశ్ విమర్శలు
2019 నుంచి 2024 వరకు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను శిక్షణ కోసం సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపిస్తుంటే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారిని మద్యం దుకాణాల వద్ద కాపలాకు పెట్టారని విమర్శించారు.
పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం
డీఎస్సీ కోసం 13 సబ్జెక్టులకు 42 వేల ప్రశ్నలను రూపొందించామని లోకేశ్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేశామని, నియామకాలపై వివిధ స్థాయిల్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు.
భిన్నాభిప్రాయాలతో 336 కేసులు నమోదయ్యాయని, పరీక్షను టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించామని వివరించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను జిల్లా యూనిట్ స్థాయిలో చేపట్టామని తెలిపారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు.
టీచర్ అర్హతలో టెట్‌ను తప్పనిసరి చేశామని, మొత్తం ప్రక్రియను టీసీఎస్ ఐయాన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ తర్వాతే నియామకాలు
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తిచేసి, ఉపకులాలను సంబంధిత గ్రూపుల్లో సెట్ చేసిన తర్వాతే డీఎస్సీ నిర్వహించామని లోకేశ్ తెలిపారు. అలాగే గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉండగా, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాటిని 65 కేటగిరీలకు పెంచామని చెప్పారు.
అక్రమాల ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్
డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. కొందరికి డీఎస్సీ అంటే ఏమిటో కూడా తెలియదని, వారే పేపర్ లీక్ వంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిగా నిర్వహించిన తర్వాతే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. “ఏడాది తర్వాత డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. మీ ఆరోపణలకు ఆధారాలు చూపండి” అని వైసీపీ నేతలను డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని, నియామక ప్రక్రియను నిబంధనల ప్రకారమే పారదర్శకంగా పూర్తి చేశామని లోకేశ్ స్పష్టం చేశారు.






































