దేశం ఆకాంక్షలను నెరవేర్చడానికి విద్యావిధానం, విద్యావ్యవస్థ ముఖ్యమైన సాధనాలు – పీఎం మోదీ

Inaugural Session of Governors, Inaugural Session of Governors Conference, National Education Policy, National Education Policy nEws, National Education Policy Updates, PM Modi, PM Modi Addresses Inaugural Session of Governors, PM Modi On National Education Policy

నూతన విద్యావిధానం-2020పై సోమవారం నిర్వహించిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటుగా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల యూనివర్సిటీల వైస్ ఛాన్సెలర్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశం ఆకాంక్షలను నెరవేర్చడానికి విద్యావిధానం, విద్యావ్యవస్థ ముఖ్యమైన సాధనాలు చెప్పారు. విద్య బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలదే అయినప్పటికీ విధాన రూపకల్పనలో వాటి జోక్యం కనీస స్థాయి లో ఉండాలని ప్రధాని అన్నారు. మరింత ఎక్కువ మంది ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులు విద్యావిధానం తో అనుబంధాన్ని ఏర్పరుచుకొన్నప్పుడు విద్యావిధానం ఔచిత్యం, సమగ్రత పెరుగుతాయని అన్నారు. దేశంలో పల్లెల్లో, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది ప్రజల నుంచి, విద్యారంగంతో సంబంధం ఉన్నవారి నుంచి అభిప్రాయాలను అందుకొన్న తరువాతే నూతన విద్యావిధానానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో పాటు ప్రతి ఒక్కరు ఈ విధానాన్ని అక్కున చేర్చుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.

నూతన విద్యావిధానాన్ని అన్ని వర్గాలు ఆమోదిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ విధానం పై ఆరోగ్యకరమైన చర్చ జరుగుతూ ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. జాతీయ విద్యావిధానం (ఎన్ఇపి) కేవలం విద్యావ్యవస్థను సంస్కరించడంపైనే కాకుండా 21వ శతాబ్దపు భారతదేశ సామాజిక వ్యవస్థ కు, ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దిశను అందించడానికి కూడా ఉద్దేశించిందని చెప్పారు. ఈ విధానం భారతదేశాన్ని స్వయంసమృద్ధి తో కూడిన (ఆత్మనిర్భర్) భారతదేశంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిందని అన్నారు. శరవేగంగా మారుతున్న పరిస్థితులలో యువతను భావికాలానికి సన్నద్దం చేయాలన్నదే ఈ విధానం లక్ష్యమని చెప్పారు. నూతన విద్యావిధానం చదువుకోవడం కన్నా నేర్చుకోవడంపై శ్రద్ధ వహిస్తుందని, పాఠ్యప్రణాళిక పరిధికి అతీతంగా పయనిస్తూ జిజ్ఞాసను అలవర్చే ఆలోచనలు చేసేందుకు పెద్దపీట వేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

భారతదేశాన్ని 21వ శతాబ్దంలో ఒక జ్ఞానభరిత ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నూతన విద్యావిధానం ద్వారా ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఆఫ్ షోర్ క్యాంపస్ లను నెలకొల్పేందుకు కూడా అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. నూతన విధానాన్ని ఎలా అమలులోకి తీసుకురావాలని ప్రస్తుతం దేశంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని, భయాందోళనలను తొలగించేందుకు విద్యారంగంతో భాగస్వామ్యం ఉన్న అన్ని వర్గాల సూచనలను, సలహాలను ఓపికతో అరమరికలకు తావు లేకుండా వినడం జరుగుతోందని ప్రధాని వివరించారు. ఈ విద్యావిధానం ప్రభుత్వం విద్యావిధానం కాదని, ఇది దేశం యొక్క విద్యావిధానం అని ఆయన తేల్చి చెప్పారు. జాతీయ విద్యావిధానం-2020 స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =