కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజి తక్కువగా ఉన్న జిల్లాలపై ప్రధాని మోదీ సమీక్ష

PM Modi held Review Meeting over Districts having Low Vaccination Coverage in the Country

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజి తక్కువగా ఉన్న జిల్లాలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తన ఇటలీ మరియు గ్లాస్గో పర్యటన ముగించుకుని బుధవారం దేశానికి తిరిగి చేరుకున్న వెంటనే ఈ సమీక్షలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటి డోస్‌లో 50 శాతం కంటే తక్కువ కవరేజీ మరియు రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలపై చర్చించారు. ముఖ్యంగా జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ మరియు తక్కువ టీకా కవరేజీ ఉన్న ఇతర రాష్ట్రాల్లోని 40కి పైగా జిల్లాల జిల్లా మేజిస్ట్రేట్‌లతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ అయ్యారు.

దేశంలో పూర్తిస్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ వేసేలా ప్రతి ఇంటి గడప తొక్కండి: 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి వలన దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. తమ జిల్లాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ ను మరింత పెంచేందుకు కొత్త వినూత్న మార్గాలపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. స్థానిక స్థాయిలో ఉన్న లోపాలను పరిష్కరించడం ద్వారా వ్యాక్సినేషన్‌లో సంతృప్త స్థాయిని సాధించడానికి ఇప్పటివరకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మైక్రో స్ట్రాటజీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. అవసరమైతే జిల్లాల్లోని ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వేర్వేరు వ్యూహాలను రూపొందించాలని చెప్పారు. ప్రాంతాన్ని బట్టి 20-25 మందితో టీమ్‌గా ఏర్పడి పనులు చేపట్టవచ్చని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్‌లను ఇప్పుడు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాల్సిన అవసరముందని అన్నారు. ప్రతి ఇంటి వద్దకు వ్యాక్సిన్ అనే సంకల్పంతో ప్రతి ఇంటికి చేరుకోవాలని ఆరోగ్య కార్యకర్తలను కోరారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేసేలా ప్రతి ఇంటి గడప తొక్కాలని కోరారు.

ప్రస్తుతం ప్రతి ఇంటికీ వ్యాక్సినేషన్ ప్రచారాన్ని తీసుకెళ్లడానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్ళినపుడు మొదటి డోస్‌తో పాటు రెండవ డోసుపై కూడా సమాన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని హెచ్చరించారు. నిర్ణీత సమయంలో రెండవ డోస్ తీసుకోని వ్యక్తులపై దృష్టి పెట్టాలని, దీనిని విస్మరించడం ప్రపంచంలోని అనేక దేశాలకు సమస్యలను ఎదురయ్యాయని చెప్పారు. దేశంలో ఉచిత వ్యాక్సినేషన్ లో భాగంగా, ఒక రోజులో సుమారు 2.5 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించి రికార్డు సృష్టించామని, ఈ ఘనత భారతదేశ సామర్థ్యాలకు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మెరుగైన పనితీరు కనబరుస్తున్న జిల్లాల్లో తోటి అధికారులు అవలంభిస్తున్న విధానాలను నేర్చుకుని, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆ విధానాలను తక్కువ కవరేజి ఉన్నచోట కూడా ఉపయోగించాలని జిల్లాల అధికారులకు ప్రధాని మోదీ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + six =